Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ తో పెరిగిన దూరం...అందువల్లే జగన్ వెనక్కితగ్గేది..: టిడిపి ఎమ్మెల్యే సంచలనం

రాష్ట్రానికి లక్షకోట్ల సంపద వచ్చేలా, భవిష్యత్ తరాలకు ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్య అవకాశాలు కల్పించేలా గత ప్రభుత్వం నిర్మించిన రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం  కాలరాసిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.  

TDP MLA Nimmala Ramanaidu sensational  comments on kcr  jagan friendship
Author
Repalle, First Published Aug 6, 2020, 8:58 PM IST

గుంటూరు: రాష్ట్రానికి లక్షకోట్ల సంపద వచ్చేలా, భవిష్యత్ తరాలకు ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్య అవకాశాలు కల్పించేలా గత ప్రభుత్వం నిర్మించిన రాజధాని అమరావతిని కాలరాసిన వైసీపీ ప్రభుత్వం... మూడు ముక్కలాటతో భావితరాల భవిష్యత్ తోనూ ఆటలాడుకుంటోందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.  

గురువారం ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే అంతిమమని, దానిప్రకారమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామన్న ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్ విసరడం జరిగిందన్నారు.  మూడు ముక్కల రాజధానినే అజెండాగా తీసుకొని అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళదామని చంద్రబాబు నాయుడు సవాల్ చేసి 70 గంటలు గడిచినా జగన్ నుంచీ, వైసిపి ప్రభుత్వం నుంచీ ఏవిధమైన సమాధానం లేదన్నారు. 

రాజధాని అంటే సాదాసీదా విషయం కాదన్నారు నిమ్మల. 175 నియోజకవర్గాలకు, ఐదుకోట్ల మందికి చెందిన అంశమని... అటువంటి అంశంలో వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. అటువంటి రాజధానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు ఐదుకోట్లమంది అభిప్రాయం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తోందన్నారు. తెలంగాణకు 60శాతం పైగా ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తోందని... అలానే ఏపీలోని 13జిల్లాలకు 50శాతం పైగా ఆదాయాన్నిచ్చే అమరావతిని కాదనే హక్కు వైసీపీకి ఎక్కడిదని నిమ్మల నిలదీశారు.  అమరావతి పూర్తయితే రాష్ట్రానికి వచ్చే లక్షకోట్లను అడ్డుకునే హక్కు వైసీపీకి లేదన్నారు. 

read more   రాజధాని అంశంలో జోక్యం చేసుకోరా?అసలు మీకా చట్టం గుర్తుందా..?: కేంద్రాన్ని నిలదీసిన బోండా

విద్య, ఆరోగ్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 13 జిల్లాలకు అందించాలన్న ఉద్దేశంతోనే గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. ఇప్పటికీ వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్ చికిత్సకోసం హైదరాబాద్ వెళుతున్నారని... అదే మనరాష్ట్రంలోనే ఆసుపత్రులుంటే ఆ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రాజధానికి భూములిచ్చిన 29వేలరైతు కుటుంబాలతో గతప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని కాదని ముందుకెళుతున్న వైసీపీ ప్రభుత్వం, భవిష్యత్ లో రైతుకుటుంబాలు కోర్టుకు వెళితే రూ.90వేలకోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆ సొమ్ము చెల్లించే సామర్థ్యం లేనప్పుడు ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ముందుకెళ్లడం ఎందుకన్నారు. 

ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో, ప్రచారంలో ఎక్కడా మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పలేదని... జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు, మడమ తిప్పడని చెప్పిన వారంతా ఇప్పుడేం సమాధానం చెబుతారని నిమ్మల నిలదీశారు. ఇచ్చిన మాట తప్పడమే కాకుండా ప్రజలను దగాచేసి, వంచించినందుకే టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాలని ఈ ప్రభుత్వానికి సవాల్ విసరడం జరిగిందన్నారు. టీడీపీ అమరావతి అంశంపై ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉందని, మూడు రాజధానుల అజెండాతో ఎన్నికలకు వెళ్లే దమ్ము, ధైర్యం వైసీపీ ప్రభుత్వానికున్నాయా అని నిమ్మల నిగ్గదీశారు. 

తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసానికి, వారు ఎక్కడ బుద్ధిచెబుతారోనన్న భయం ఉండబట్టే పాలకులు ఎన్నికలకు వెళ్లడానికి జంకుతున్నారని నిమ్మల స్పష్టంచేశారు.  2019 ఎన్నికల్లో పొరుగు రాష్ట్ర నాయకుడి సాయంతో ఎన్నికల్లో లబ్ధిపొందిన వైసీపీ ప్రభుత్వానికి, ఇప్పుడు అటువంటి లబ్ది కూడా లభించే పరిస్థితి లేనందునే ఎన్నికలకు వెళ్లడం లేదన్నారు. సత్యానికి, ధర్మానికి కట్టుబడకుండా నీతి, న్యాయం తప్పి పాలన చేయడం వల్లే ఎన్నికలకు వెళ్లే ధైర్యం జగన్ చేయలేకపోతున్నాడన్నారు. 

వైసిపి అనుకూల దినపత్రికలో వైసీపీ మేనిఫెస్టోను వక్రీకరిస్తూ కథనాలు రాస్తున్నారని, ఆనాడు ఉమ్మారెడ్డి ఏం చెప్పాడో తెలుసుకుంటే మంచిదన్నారు. మంత్రి అనిల్ కుమార్ చంద్రబాబుకి కడుపు మంట అంటున్నాడని... 14నెలలపాలనలో ఈ ప్రభుత్వం ఏంచేసిందో చెప్పే ధైర్యం మంత్రికి ఉందా? అని నిమ్మల ప్రశ్నించారు. సిగ్గులేకుండా మాట్లాడుతున్న అనిల్ ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి ఏం పరిశ్రమలు, కంపెనీలు వచ్చాయో చెప్పాలన్నారు. రాష్ట్రానికి వచ్చే రూ.లక్షకోట్ల సంపదను రాకుండా చేసినందుకు అనిల్ కుమారే సిగ్గుతో తలదించుకోవాలన్నారు. 

మరో మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పుడు నోరు తెరిచినా ఆయనేం మాట్లాడతాడో ఆయనకే తెలియదని, ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు వెళితే ఎవరికి మతి ఉందోలేదో ప్రజలే నిర్ణయిస్తారని రామానాయుడు తేల్చిచెప్పారు.  ప్రజల్లోకి వెళితే ఎవరికి ఎవరు రాజకీయ సమాధి కడతారో తెలుస్తుందనే నిజాన్ని కొడాలి నాని తెలుసుకోవాలన్నారు. 

వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ కక్షసాధింపుల కోసం ఈ ప్రభుత్వం 29వేల రైతు కుటుంబాలను నాశనం చేస్తామంటే టీడీపీ చూస్తూ ఊరుకోదన్నారు. మూడు రాజధానుల అజెండాతో ఈ ప్రభుత్వం ప్రజాభిప్రాయం కోరాలని, ప్రజాకోర్టులో తీర్పు వారికి అనుకూలంగా వస్తే  30 రాజధానులు కట్టినా టీడీపీ మాట్లాడదని నిమ్మల తెగేసి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios