విజయవాడ: ఐదుకోట్ల మంది ప్రజలను మోసం చేస్తూ వారికి వెన్నుపోటు పొడిచేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని... దీనిపై తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామని వైసీపీ ప్రభుత్వానికి సవాల్ చేస్తే జగన్ తోకముడిచాడని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. 

ఇక రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో తమ జోక్యం ఉండదంటున్న కేంద్రం, విభజన చట్టాన్ని గుర్తుచేసుకోవాలని ఉమా సూచించారు. ఆనాడు అధికారంలో ఉన్నవారు, ప్రతిపక్షంలో ఉన్నవారు కలిసే రాష్ట్రాన్ని విడగొట్టారన్నారు. విభజనచట్టం ప్రకారమే శివరామకృష్ణన్ కమిటీ అమరావతి ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. కమిటీ సూచనల ప్రకారమే 5కోట్లమందికి అనుకూలంగా ఉండేలా విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించడం జరిగిందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ వేసిన కేంద్రమే ఇప్పుడు తమ పరిధిలో లేదని చెప్పడం సరికాదన్నారు.  

దేశానికి సంబంధించి పరిపాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం, అమరావతి ఢిల్లీని తలదన్నే రాజధాని కాబోతుందని చెప్పిన మోదీ, ఇప్పుడు మౌనం వహించడం ఎంతమాత్రం భావ్యం కాదని బొండా అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఆమోదముద్రతోనే హైకోర్టు కూడా ఏర్పడిందని, విభజన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పడిందన్నారు. 

వైసీపీకి ముసుగులో సహకరిస్తున్న పార్టీల వారు మరోసారి ఏపీ ప్రజలను క్షోభకు గురిచేసేలా వ్యవహరించవద్దని, రాజకీయ ప్రయోజనాలకోసం మూడు ముక్కలాట ఆడవద్దని ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

read more   3రాజధానులు: జగన్ కి కేంద్రం ఊరట, హైకోర్టులో అఫిడవిట్

వైసీపీ అధినేత జగన్, ఆయనపార్టీ ముఖ్యనేతలు అమరావతి గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారో, ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలే ఆలోచించాలన్నారు. ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని స్పష్టమైన హామీ ఇచ్చిన వైసీపీ నేడు ఏరుదాటాక తెప్పతగలేస్తూ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను నాశనం చేస్తోందన్నారు. జగన్ నిర్ణయం సరైనదే అయితే ప్రభుత్వాన్ని రద్దుచేసి, ప్రజల్లోకి వెళ్లడానికి ఎందుకు ఆలోచిస్తున్నాడో సమాధానం చెప్పాలని బొండా డిమాండ్ చేశారు. 

గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ, మరోపార్టీ బీజేపీ అమరావతి నిర్మాణాన్ని స్వాగతించబట్టే రైతులు తమ భూములను త్యాగం చేశారన్నారు. భావితరాలు అమరావతి ఎవరు నిర్మించారంటే చంద్రబాబు పేరు చెప్పుకుంటారన్న దురుద్దేశంతో కేవలం ఒక వ్యక్తిమీద కక్షతోనే ప్రభుత్వం ఐదుకోట్ల ప్రజల భవిష్యత్ ను నాశనం చేయడానికి సిద్ధమైందని ఉమా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది కేవలం భూములిచ్చిన రైతుల సమస్యకాదని ప్రజలందరిదని అన్నారు. 

ఇదివరకు వైసిపి అనుకూల మీడియాలో అమరావతి గురించి నానా యాగీ చేశారని, వేలఎకరాలు చంద్రబాబు, టీడీపీనేతలు దోచేశారని, రూ.2లక్షలకోట్ల అవినీతి జరిగిందని పుస్తకాలేశారన్నారు. ఆనాడు చెప్పిన అబద్ధమే పదేపదే చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రూ.2లక్షలకోట్ల అవినీతిపై ఏం తేల్చిందని... దీనిపై 14నెలల్లో ఏం సాధించిందని బొండా నిలదీశారు. 

ఏసీబీ, విజిలెన్స్, సీబీసీఐడీ వంటివన్నీ ప్రభుత్వ చేతిలోనే ఉన్నా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఎందుకు తేల్చలేదన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎక్కడా జరగలేదని, సీబీసీఐడీ, విజిలెన్స్ ఏమీ జరగలేదని తేల్చాయి కాబట్టే ప్రభుత్వం మిన్నకుండిపోయిందన్నారు. మళ్లీ ఇప్పుడు సీబీఐకి ఇస్తున్నామంటూ కొత్త పల్లవి మొదలెట్టారని, దానితో కూడా ఒరిగేదేమీలేదన్నారు. రూ.10వేల కోట్లు ఖర్చుపెట్టి అమరావతిని నిర్మిస్తే, వైసీపీ తన స్వార్థంకోసం, తమ పార్టీ నేతల రాజకీయ  లబ్ధికోసం మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందన్నారు. 

అధికారంలోకి వచ్చిన ఈ 14నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర, రాయలసీమలోని ఏడుజిల్లాలకు ఏం చేసిందో చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం రూ.62వేలకోట్ల విలువైన సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభిస్తే వాటిలో రూ.40వేలకోట్ల విలువైన ప్రాజెక్టులు రెండు ప్రాంతాల్లోని ఏడు జిల్లాల్లోనే ఉన్నాయన్నారు. అవిగాక అదనంగా అనేక పరిశ్రమలు, కంపెనీలను తీసుకొస్తే ఈప్రభుత్వం వాటిని కమీషన్లకోసం తన్ని తరిమేసిందన్నారు.   ఏడు జిల్లాల్లోని ప్రతి గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించి, రోడ్లు వేయడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్రకు రూ.లక్ష కూడా ఖర్చుచేయలేదని, రాయలసీమకు ఒక్కకోటి కూడా వెచ్చించలేదన్నారు. 

టీడీపీ ప్రభుత్వం కట్టిన భవనాలకు రంగులేసుకోవడం తప్ప 14నెలల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఏడాది పాలనలో రూ.లక్షకోట్ల అప్పు తెచ్చి, పేదలకు పప్పుబెల్లాల్లా చిల్లర పంచి మిగిలిన సొమ్మంతా కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని బొండా దుయ్యబట్టారు. ఇంకో 25ఏళ్లు, 30ఏళ్లు జగనే ముఖ్యమంత్రిగా ఉంటాడని ఊదరగొడుతున్నవారంతా, ప్రజల తీర్పు కోరడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం ప్రభుత్వానికి లేదని, కాబట్టే కుట్రపూరితంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని 30ఏళ్లపాటు వెనక్కు తీసుకెళ్లిందన్నారు. 

ఏ ప్రభుత్వం కూడా హైకోర్టు,  సుప్రీంకోర్టుతో ఇన్నిసార్లు మొట్టికాయలు వేయించుకోలేదన్నారు. ప్రజలంతా కరోనాతో అల్లాడిపోతుంటే రాజకీయ ప్రయోజనాల కోసం, విశాఖలోని తమ భూముల విలువ పెంచుకోవడం కోసం మూడు ముక్కలాట ఆడుతున్నారని బొండా ఆక్షేపించారు. ఇప్పటికే అనేక ముఠాలు విశాఖలో దిగి, స్థలాలు, భూయజమానులను బెదిరిస్తున్నాయన్నారు. 

వైసీపీ నేతలు విశాఖలోని తమ భూముల విలువ పెంచుకోవడం కోసం, భూముల కబ్జా కోసం మూడు ముక్కలాట ఆడటం ఆపేసి ప్రజాతీర్పు కోరడానికి ఎన్నికలకు వెళ్లాలని బొండా డిమాండ్ చేశారు.