గుంటూరు: ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.లక్షా 8 వేల కోట్లు అప్పుచేయడం జరిగిందని. మరింత అప్పు చేయడం కోసం రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ ను నీరుగారుస్తోందని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. సజావుగా సాగుతున్న ఉచిత పథకంలో నగదు బదిలీ చేపట్టడం రైతులను ఇబ్బంది పెట్టడానికేనని అన్నారు. 

''నవరత్నాల్లో ఉన్న హామీలకు రోజుకో షరతు పెట్టి ప్రయోజనాలను కుదిస్తున్నారు. ప్రభుత్వం మితిమీరి అప్పులు చేయడానికి రైతులను అప్పుల ఊబిలోకి దించబోతున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు విషయంలో రైతులకు జగన్ చెల్లించడం మధ్యలో మానేస్తే వారి గతేంటి? రైతులకు సంబంధించి ఇప్పటికే సున్నా వడ్డీ పథకం కింద అసలు వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలి. ఇప్పుడు రైతులనే ముందుగా చెల్లించాలని, తర్వాత ప్రభుత్వం రీయింబర్స్ చేస్తోందని చెబుతోంది. ఇప్పుడు వ్యవసాయానికి విద్యుత్తు బిల్లుల్లో కూడా ఇదే పరిస్థితి రాదనే గ్యారెంటీ లేదు'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''రైతుల కోసమే సౌర విద్యుత్ అని చెప్పడం కూడా బూటకమే. సౌర విద్యుత్ లో కూడా వేల కోట్ల స్కామ్ జరగబోతోందని వార్తలు వస్తున్నాయి. జీతాలు, పెన్షన్లు సమయానికి ఇవ్వలేని ప్రభుత్వం ఈ టైం లో విద్యుత్ బిల్లులు ఇస్తుందని చెప్పలేం. రైతుల కోసమే సౌర విద్యుత్ అయితే మీటర్లు ఎందుకు పెడుతున్నారు? ఇది రైతుల్ని అప్పుల ఊబిలోకి దించుతోంది. ఆత్మహత్యలు పెంచుతుంది'' అని అన్నారు. 

'' రైతు ఆత్మహత్యల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 3వ స్థానంలో ఉంది. 2019లో 1,029 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన రుణమాఫీ రద్దు చేయడం వల్ల ఆత్మహత్యలు పెరిగాయి. మళ్లీ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడితే ఆత్మహత్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది'' అని వాపోయారు. 

read more   రాజకీయ భిక్ష పెట్టిన వారికే జగన్ వెన్నుపోటు...: బోండా ఉమ ఫైర్

''విద్యుత్ కష్టాలు తగ్గించేందుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించడం మోసం. జగన్ మేనిఫెస్టోలో మీటర్లు పెడతామని చెప్పకుండా ఇప్పుడు మీటర్లు పెట్టి రైతులను దగా చేస్తున్నారు. విద్యుత్ సంస్థలను సమర్థవంతంగా నడపడంలో విఫలమై రైతులపై భారం వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం రైతులను వంచించడమే. ప్రభుత్వం ఎక్కువ అప్పులు తెచ్చి.. అవినీతికి పాల్పడేందుకు ఉచిత విద్యుత్ విధానాన్ని మార్చుతోందని... దీనవల్ల  చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతారు'' అని పేర్కొన్నారు. 

''కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 2వ స్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు తాజాగా వెల్లడించింది. ఇప్పటికే రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేక, సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా కాక అప్పుల్లో కూరుకుపోయారు. జగన్ ఈ విద్యుత్ విధానం వల్ల రైతులు మరింత దెబ్బతింటారు'' అని నిమ్మల హెచ్చరించారు. 

''తండ్రి వద్దన్నది కుమారుడు చేస్తున్నాడు. పంపుసెట్లకు మీటర్లు పెట్టడాన్ని ఆనాడు తండ్రి వైఎస్ వ్యతిరేకిస్తే కుమారుడు నేడు తండ్రి వర్థంతి రోజే పంపుసెట్లకు విద్యుత్ మీటర్ల విధానాన్ని పెట్టి రైతు ద్రోహిగా నిలిచిపోయాడు. వ్యవసాయ పంపు సెట్లకు 1983కి ముందు మీటర్లు ఉండేవి. స్వర్గీయ ఎన్టీఆర్‌ మీటర్ల విధానాన్ని తొలగించి శ్లాబ్‌ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీంతో రైతులు లాభపడ్డారు'' అని గుర్తుచేశారు. 

''చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 1999లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులను దొంగల్లా భావించి మీటర్లు పెడుతున్నారా అని విమర్శలు గుప్పించారు. నేడు వైఎస్ కుమారుడు జగన్ అవే మీటర్లను తిరిగి పెడుతున్నారు'' అని అన్నారు. 

''రోజుకు 10 గంటలు కరెంట్ కోతల నుంచి చంద్రబాబు వచ్చిన తర్వాత అదనంగా 10 వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసి కరెంట్ కోతలు నివారించారు. విద్యుత్ రంగంలో గడచిన ఐదేళ్లలో రూ.40వేల కోట్ల ఆస్తిని సృష్టించి జగన్ చేతిలో పెట్టారు. మిగులు విద్యుత్ ను అందించారు. ఐదేళ్లలో చంద్రబాబు విద్యుత్ చార్జీలను పెంచలేదు. జగన్ వచ్చిన తర్వాత రెట్టింపు చేశారు. రైతులతో పాటు విద్యుత్ వినియోగదారులందరూ అప్రమత్తం కావాలి. విద్యుత్ విధానాలను నిరసించి తమను తాము కాపాడుకోవాలి. తెలుగుదేశం విద్యుత్ వినియోగదారులందరికీ అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుంది'' అని నిమ్మల వెల్లడించారు.