పెద్దాపురం: తిరుమల కొండపై వెలిసిన ఆ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శంచాలంటే డిక్లరేషన్ పై సంతకం చేయాలి అనే నియమాన్ని ఖచ్చితంగా పాచించాలని మాజీ ఉపముఖ్యమంత్రి, టిడిపి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. ఎంతటివారయినా సనాతన ధర్మం, సంప్రదాయాలను గౌరవించాలని అన్నారు. 

తిరుమల కొండపైకి వెళ్లే అన్యమతస్తులు ఖచ్చితంగా డిక్లరేషన్ సమర్పించేలా చూడాలంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డికి లేఖ వ్రాయడం ఒక ఉద్యమంలా  చేపట్టడం జరిగింది. వైసీపీ 16 నెలల పాలనలో అరాచకాలు, మతాల మధ్య చిచ్చు, దాడులతో ముందుకు వెళుతోందని చినరాజప్ప విమర్శించారు.

''తిరుమల తిరుపతి దేవస్థానం ఔన్నత్యం దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి ఇవాళ పట్టువస్త్రాలతో తిరుమల కొండపైకి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇస్తూ సంతకం పెట్టి ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి'' అని సూచించారు.

read more   జగన్ మీద కుట్ర, కొడాలి నాని వంటివాళ్ల పాత్ర: పరిపూర్ణానంద

''అన్యమతస్తులు కొండపైకి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలన్నది మొదటి నుంచి వస్తున్న సంప్రదాయం. అభివృద్ధి వికేంద్రీకరణ ఎక్కడా కనిపించడం లేదు కానీ దేవాలయాలు పడగొట్టడంపై వికేంద్రీకరణ కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే కానుకలు ఆస్తులను డైవర్ట్ చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సుబ్బారెడ్డి ప్రణాళికలు తయారు చేస్తున్నారు'' అని నిమ్మకాయల ఆరోపించారు. 

''హిందూమతంపై ఈ ప్రభుత్వం చేసే కుట్రలను హిందువులు తిప్పికొడతారు. ఈ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల్లో ఉన్న విగ్రహాలను రాతి బొమ్మల మాదిరిగా చూస్తున్నారు. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి'' అన్నారు. 

''ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్రహ్మోత్సవాల్లో భాగంగా  సాయంత్రం 6:30 గంటలకు శ్రీవారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కాగా.. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ఏ మతానికి చెందినవారైనా డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి కావున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ సంప్రదాయాన్ని పాటించాలి అని తెదేపా తరపున  డిమాండు చేస్తున్నాం'' అని మాజీ హోంమంత్రి వెల్లడించారు.