అమరావతి: రాష్ట్రంలోని దేవాలయాల్లో జరుగుతున్న విధ్వంసాలపై కచ్చితంగా సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని  పరిపూర్ణానందస్వామి కోరారు. ఒకవేళ సీఎం జోక్యం చేసుకోకపోతే కేంద్రం జోక్యం చేసుకొంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను చిత్తుగా ఒడించడానికి కుట్ర పన్నారేమోననే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. నానిలాంటి వాళ్లు ఈ కుట్రలో భాగమయ్యారని ఆయన ఆరోపించారు.

 కుట్రలు జరుగుతున్నాయేమో గుర్తించాలని సీఎం జగన్ కు పరిపూర్ణానంద సూచించారు. తిరుమల కొండతో పెట్టుకొన్నవారి బూడిద కూడ మిగల్లేదన్నారు. 
జగన్ కు భారీ మెజారిటీ రావడానికి హిందూవులే కారణమన్నారు.ఆలయాల గురించి మాట్లాడాలంటే అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

రథం మీకు ఒక చెక్క,.. ఆంజనేయస్వామి ఒక బొమ్మ అంటూ మంత్రి నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తిరుమల ఎవడబ్బ సొమ్ము అనడాన్ని ఆయన తప్పుబట్టారు. తిరుమలలో డిక్లరేషన్ పై ప్రశ్నించడం అహంకారమేనని ఆయన చెప్పారు. 

పీఠానికి ద్రోహం చేసిన జయలలిత ఎలా చనిపోయిందో చూశామన్నారు. ఇందిరాగాంధీ కూడ దిక్కు లేకుండా చనిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొందరు ముఖ్యమంత్రులు కూడ ఎలా చనిపోయారో చూశామని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని మంత్రి కొడాలి నానికి ఆయన సూచించారు. 

బ్రిటిష్ పాలకులు కూడ తిరుమల పవిత్రతను కాపాడారని పరిపూర్ణానందస్వామి తెలిపారు.నోరుందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దని ఆయన మంత్రి కొడాలి నానికి హితవు పలికారు.హిందూవుల మనోభావాలను  దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రి కొడాలి నాని కూడ తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.