రాజమండ్రిలో ఫిరాయింపు నేతకు బహిరంగంగానే ఘోర అవమానం ఎదురైంది. అందరూ చూస్తుండగానే టిడిపి సీనియర్ నేత, ఎంఎల్ఏ బుచ్చయ్య చౌదరి ఫిరాయింపు నేతను పట్టుకుని ‘నోరు మూసుకుని కూర్చోకపోతే నరికేస్తా’ అంటూ హెచ్చరించేసరికి అక్కడున్న వాళ్ళందూ ఒక్కసారిగా బిత్తరపోయారు.

ఇంతకీ విషయం ఏమిటంటే రాజమండ్రికి చెందిన వైసిపి ఎంఎల్సీ ఆదిరెడ్డి అప్పారావు టిడిపిలోకి ఫిరాయించారు. సరే, ఇతర ఫిరాయింపుల్లాగే ఆదిరెడ్డి కూడా అవమానాలే ఎదురవుతున్నాయి. అయితే, తాజాగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆదిరెడ్డి, బుచ్చయ్య, రాజమండ్రి బిజెపి ఎంఎల్ఏ ఆకుల సత్యనారాయణతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా పాల్గొన్నారు.

సమావేశంలో శాప్( స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఏపి) విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆదిరెడ్డి మాట్లాడుతూ శాప్ నుండి రాజమండ్రికి తాను కూడా నిధులను సాధించుకుని వచ్చినట్లు చెప్పారు. దాంతో బుచ్చయ్య ఒక్కసారిగి ఎంఎల్సీపై విరుచుకుపడ్డారు. అసలే ఆదిరెడ్డి-బుచ్చయ్యకు పడదు. దాంతో బుచ్చయ్య రెచ్చిపోవటంతో ఎవరూ జోక్యం చేసుకోలేదు. దాన్ని అవకాశంగా తీసుకున్న బుచ్చయ్య ‘రాజమండ్రి అభివృద్ధికి నీవెవరు నిధులు తేవటానికి’ అంటూ చెలరేగిపోయారు.

అయితే ఆదిరెడ్డి ఏదో సమాధానం చెప్పబోగా బుచ్చయ్య మండిపడ్డారు. ‘పార్టీలో ఉండాలనుకుంటే నోరు మూసుకుని పడివుండు..లేకపోతే నరికేస్తా’ అని హెచ్చరించటంతో అక్కడున్న వారందరూ  బిత్తరపోయారు. బుచ్చయ్యకు బిజెపి ఎంఎల్ఏ కూడా మద్దతుగా నిలవటంతో చేసేది లేక ఆదిరెడ్డి సమావేశం నుండి అవమానంతో బయటకు వెళ్ళిపోయారు.