గుంటూరు: క్రికెట్ లో సింగిల్ రన్స్ తీయడం చేతకాని వ్యక్తి  సెంచరీ కొడతానని ప్రగల్బాలు పలికాడంటా... ఆ విధంగా ఉంది రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఖరి అంటూ టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. అనంతపురంలో వార్డు సచివాలయ భవనాలకు ప్రభుత్వం అద్దెకట్టలేదని యజమానులు తాలాలు వేసి ఉద్యోగులను  రోడ్డు మీదకు నెడుతున్నారని అన్నారు. ఇలా భవనాలకు అద్దెకట్టడటం చేతకాలేదు గానీ 3 రాజధానులు  కడతారా? అంటూ సెటైర్లు విసిరారు. 

''ప్రభుత్వా నికి అసలు 3 రాజధానుల సలహా ఇచ్చింది ఎవరు? జగన్ కి బెంగుళూరు, హైదరాబాద్, తాడేపల్లి ఇలా 3 చోట్ల 3 ఇళ్ళు ఉన్నాయని 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారా? లేక వైసీపీ జెండాకు 3 రంగులు ఉన్నాయి కాబట్టి 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారా?  వైసీపీ నేతలకు పాలన చేతకాకపోతే ఇంట్లో ఓ మూలన కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకోవాలి అంతే తప్ప అస్తవ్యస్త నిర్ణయాలతో రాష్ట్రాన్ని నాశనం చెయ్యొద్దు'' అంటూ మండిపడ్డారు. 

read more   అసలుకే ఎసరు: అమరావతిపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

''వైసీపీ ప్రభుత్వం తీసుకునే అనాలోచిత, అజ్ఞానపు నిర్ణయాలను న్యాయస్థానాలు అడ్డుకోకపోతే వైసీపీ నేతలు ఈ పాటికి రాష్ట్రాన్ని నిలువునా అమ్మేసేవారు. ఆడబిడ్డలు ఏడిస్తే ఇంటికి, అన్నదాతలు ఏడిస్తే దేశానికి మంచిది కాదంటారు... కానీ వైసీపీ  పాలనలో వీళ్ళు ప్రతి రోజు ఏడుస్తూనే ఉన్నారు.  3 రాజధానుల పేరుతో అమరావతి రైతులని ముఖ్యమంత్రి  ముప్ప తిప్పలు పెడుతున్నారు. 5 కోట్ల మంది భవిష్యత్ బాగు కోసం భూమిలిచ్చిన రైతులు, మహిళలు నెలల తరబడి ఉద్యమం చేస్తున్నా ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవటం బాధాకరం'' అని అన్నారు. 

''వైసీపీ నేతలు అమరావతిపై దుష్ప్రచారం చేయడానికే ఏడాదిన్నర కాలం వృధా చేసారు, ఇప్పుడు  3 రాజధానుల పేరుతో మిగిలిన 3 సంవత్సరాల సమయం వృధా చేయడం తప్ప 3 ఏళ్లలో 3 ఇటుకలు కూడా పేర్చలేరు అన్న విషయం ప్రజలకు తెలిసిపోయింది.  ముఖ్యమంత్రి ఇప్పటికైనా 3 రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకుని రాష్ట్రాభివృద్ధి పై  దృష్టి పెట్టాలి'' అని అనగాని సత్య ప్రసాద్ సూచించారు.