విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను బట్టి అమరావతికి అసలుకే ఎసరు పెడుతున్నట్లు తెలుస్తోంది. శాసన రాజధానిగా కూడా అమరావతి వద్దని కొడాలి నాని అన్నారు. ఈ విషయాన్ని తాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి చెప్పినట్లు ఆయన తెలిపారు. 

ఆ విషయంపై అన్ని పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుందామని జగన్ అన్నారని, దానిపై కూడా చర్చిద్దామని అన్నారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేసి అమరావతిలో శాసనసభ రాజధానిని మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్థితిలో కొడాలి నాని చేసిన ప్రకటన తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబుపై నాని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఎమ్మెల్యేల బలం లేదని, ఉన్నవారు కూడా జారిపోతున్నారని ఆయన అన్నారు. నారా లోకేష్ ను ఎమ్మెల్యే చేయడం ఎవరి వల్ల కూడా కాదని ఆయన అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామంటే కోర్టుకు వెళ్లి స్టేలు తేవడం విడ్డూరమని నాని అన్నారు. రూ.30 వేల కోట్లతో ఏపీ గ్రీన్ కార్పోరేషన్ ను తెస్తున్నట్లు ఆయన తెలిపారు.