అమరావతి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తున్న సమయంలో ఉభయ సభల్లో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనే ఉభయ సభల నుండి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుండి వాకౌట్ చేశారు. 

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం నాడు ప్రారంభించారు.  రాజ్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించారు.

also read:మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించిన గవర్నర్

గవర్నర్ ప్రసంగం సమయంలో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. ముందుగా నిర్ణయించిన ప్రకారంగానే టీడీపీ సభ్యులు నల్లచొక్కాలతోనే అసెంబ్లీకి హాజరయ్యారు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీపీఈ కిట్ ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు.

గవర్నర్ ప్రసంగం సమయంలో  అసెంబ్లీలో టీడీపీ సభ్యులు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై కేసులు, అరెస్టులపై టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.కక్షసాధింపు, వేధింపులు ఆపాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సభలో పెద్దగా నినాదాలు చేశారు. 

ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వంపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుండి వాకౌట్ చేస్తున్నట్టుగా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు.అసెంబ్లీలో టీడీపీ సభ్యులకు దూరంగా వల్లభనేని వంశీ, మద్దాలి గిరి కూర్చున్నారు. 

మరో వైపు శాసనమండలిలో కూడ టీడీపీ ఎమ్మెల్సీలు కూడ గవర్నర్ ప్రసంగం సాగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. కొద్దిసేపు నిరసన తెలిపిన తర్వాత సభ నుండి వాకౌట్ చేశారు.