అమరావతి:  మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90 శాతం తమ ప్రభుత్వం అమలు చేసిందని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నాడు ప్రారంభమయ్యాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాలను ప్రారంభించారు.

ఏపీ బడ్జెట్ కు కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది.  గవర్నర్ ప్రసంగం తర్వాత ఏపీ  అసెంబ్లీలో  రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

తొలిసారిగా  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.కరోనా నేపథ్యంలో రాజ్ భవన్ నుండి వీడియో కాన్పరెన్స్ ద్వారా  గవర్నర్ ప్రసంగించారు. ఉభయ సభల సభ్యులు ఆయా సభల్లోనే కూర్చొని గవర్నర్ ప్రసంగాన్ని విన్నారు.


129 హామీల్లో 77 హామీలను ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన చెప్పారు. మేనిఫెస్టోలో లేని 40 హామీలను కూడ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. వివిధ సంక్షేమ పథకాలకు 42 వేల కోట్లను ఖర్చు పెట్టామన్నారు. మూడేళ్లలో 48 వేల పాఠశాలలను ఆదునీకరించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టుగా గవర్నర్ తెలిపారు. 

వ్యవసాయ అనుబంధరంగాల్లో 8 శాతం అభివృద్ధి సాధించినట్టుగా ఆయన చెప్పారు. సేవారంగంలో 9.1 శాతం వృద్ధి సాధించినట్టుగా ఆయన గుర్తు చేశారు. పారిశ్రామిక రంగంలో 5 శాతం వృద్ధిని సాధించినట్టుగా ఆయన తెలిపారు.  

ఈ ఏడాది వివధ పథకాల ద్వారా 3.98 కోట్ల మంది లబ్ది పొందారన్నారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకే  నేరుగా నగదును జమ చేస్తున్నట్టుగా గవర్నర్ తెలిపారు. 

 ఆరోగ్యశ్రీ  పథకం కింద 6.25 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద రూ.1,534 కోట్ల సహాయం అందించామన్నారు.జగనన్న గోరుముద్ద కోసం రూ. 1,105 కోట్లు కేటాయించినట్టుగా ఆయన తెలిపారు. గ్రామాల్లో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు చేసినట్టుగా గవర్నర్ చెప్పారు.వైఎస్ఆర్ ఆసరా పథకం కోసం రూ. 72.82 కోట్లను ఖర్చు చేస్తున్నట్టుగా తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయం వద్ద రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు.

వైఎస్ఆర్ కంటి వెలుగు కోసం రూ. 53.85 కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు. గత ఏడాదితో  పోలిస్తే తలసరి ఆదాయం 12 శాతం వృద్ధి సాధించినట్టుగా గవర్నర్ ప్రకటించారు.2019-20ay 8.16 శాతం వృద్ధిరేటును సాధించినట్టుగా ఆయన తెలిపారు.

జగనన్న వసతి దీవెన పథకం కింద రూ. 3857 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రుల ఆధునీకరణకు రూ. 15,337 కోట్లు కేటాయించినట్టుగా గవర్నర్ చెప్పారు.వైఎస్ఆర్ రైతు భరోసా పథకం తొలి దశ పూర్తి చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.