నేతలకు అధికార మత్తు బాగానే తలెకెక్కింది. అందుకనే వారి అరాచకలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.
‘నువ్వు గడ్డితింటున్నావు’. ‘గడ్డితిని ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను నడిపిస్తున్నావ్’. ‘ఎంపిని నేను ఆఫీసుకు వస్తుంటే వెళ్ళిపోతావా’? ‘నువ్వేమన్నా పై నుండి దిగొచ్చావా’? ‘ఏం బ్రతుకు నీది’? ఇవన్నీ సినిమాలో డైలాగ్ లు కావు. అధికారపార్టీ నేతలు రవాణాశాఖ కమిషనర్ను బహిరంగంగా అన్న మాటలు. పైగా కమీషనర్ అంటే ఐపిఎస్ అధికారి. అయినా వారికి లెక్కేలేదు. అందుకనే ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అలా ఎందుకు మాట్లాడారంటే, నేతలకు అధికార మత్తు బాగానే తలెకెక్కింది. అందుకనే వారి అరాచకలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.
తాజాగా విజయవాడలో ఏకంగా రవాణా శాఖ కమీషనర్ బాలసుబ్రమణ్యంపైనే దేశం నేతలు తిట్లదండకం అందుకున్నారు. అదికూడా బహిరంగంగానే. అంతేకాకుండా కమీషనర్ గన్మెన్ను తోసేయటం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలతో రవాణాశాఖ అధికారులు కుమ్మకై డబ్బులు తీసుకుని పర్మిట్లు ఇస్తున్నారన్నది టిడిపి నేతల అభియోగం. ఒకవేళ అదే నిజమైతే ప్రభుత్వం వారిదే కాబట్టి అధికారులను కట్టడిచేయటానికి మార్గాలు అనేకం ఉంటాయి. కానీ అవేవీ పట్టించుకోకుండా ఏకంగా అందరి ముందూ దుర్బాషలాడటమే పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
అధికారపార్టీ విజయవాడ ఎంపి కేశినేని నాని, విజయవాడ సెంట్రల్ ఎంఎల్ఏ బోండా ఉమ, ఎంఎల్సీ బుద్దా వెంకన్నలు శనివారం మధ్యాహ్నం రవాణా కమీషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయానికి కమీషనర్ కార్యాలయం నుండి వెళ్ళిపోతుంటే అడ్డుకున్నారు. కారులో నుండి కమీషనర్ ను క్రిందికి దింపి నానితో పాటు బోండా ఉమ తిట్లదండకం అందుకున్నారు. దాంతో ఏం చేయాలో అర్ధంకాక కమీషనర్ వారికి దండం పెట్టేసారు. కమీషనర్ గన్ మెన్ను ఉమ తోసేసారు. ఉమ దురుసుగా వ్యవహరించటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు గొడవైంది. కేవలం అధికారంలో ఉన్నారన్న కారణంగానే ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.
వైసీపీ ఎంఎల్ఏ డిజిపిని ‘చంద్రబాబు బానిసవా’ అని ప్రశ్నించినందుకే పోలీసు అధికారుల సంఘానికి పొడుచుకుని వచ్చింది. రోజాను ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాకుండా రాజకీయ నేతల్లా అల్టిమేటమ్ కూడా జారీ చేసారు. మరి అదే సంఘం నేతలు ఇపుడు ఎందుకు నోరు మెదపటం లేదు? వారి ఆత్మగౌరవాన్ని కాకులు ఎత్తుకెళ్లాయా? హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప గానీ నిప్పు చంద్రబాబునాయుడు గానీ ఘటనపై నోరు మెదపకపోవటం ఆశ్చర్యంగా ఉంది.
