ఎంతో నమ్మకంతో కూతురిని ఒంటరిగా సమీపబంధువైన టిడిపి నాయకుడి వెంట పంపితే అతడు దారుణానికి ఒడిగట్టాడు. కూతురి వయసున్న బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనకాపల్లి : దగ్గరివాడే కదా అని నమ్మి కూతురికి తోడుగా పంపినవాడే తోడేలులా మారాడు. బాలిక తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ముచేస్తూ బాలికను కాపాడాల్సిన వాడే కాటేసాడు. దగ్గరి బంధువొకడు మైనర్ బాలికను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడిన అమానుష ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధిత బాలిక కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం గజిరెడ్డపాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలిక (16) ఇటీవలే పదోతరగతి పూర్తిచేసింది. పరీక్షలు పూర్తయిన తర్వాత ఇంట్లో వున్న ఆమెపై సమీప బంధువు, టిడిపి నాయకుడు చేపల చిట్టిబాబు (42) కన్నేసాడు. కూతురి వయసున్న బాలికను అనుభవించాలని అదునుకోసం ఎదురుచూసాడు.
ఇదే సమయంలో మాకవరపాలెం మండలం నగరం గ్రామంలో స్నేహితురాలి ఇంట్లో పంక్షన్ వుండటంతో బాలిక వెళ్లడానికి సిద్దమయ్యంది. దీంతో బాలికను ఒంటరిగా పంపలేక చిట్టిబాబును తోడుగా వెళ్లాలని తల్లిదండ్రులు కోరారు. ఇదే అదునుగా భావించిన అతడు మే 12న బాలికను తీసుకుని కారులో వెళ్ళారు. స్నేహితురాలి ఇంట పంక్షన్ ముగిసాక బాలికను తీసుకుని చిట్టిబాబు గజిరెడ్డపాలెంకు బయలుదేరారు. మార్గమధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో కారును నిలిపిన నీచుడు బాలికను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
తనను వదిలిపెట్టాలని ఎంత వేడుకున్నా కనికరం చూపకుండా బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించడంతో భయపడిపోయిన బాలిక ఎవరీకి చెప్పలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన చిట్టిబాబు బాలికపై వేధించడం ప్రారంభించాడు. అతడి వేధింపులు మరీ మితిమీరిపోవడంతో భరించలేకపోయిన బాలిక ఇటీవల తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు తెలిపింది.
దీంతో బాలిక తల్లిదండ్రులు చిట్టిబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పొలీసులు నిందితున్ని అరెస్ట్ చేసారు. అయితే బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన చిట్టిబాబును ప్రాణాలతో జైల్లో పెట్టకూడదని... ఎన్కౌంటర్ లేదా ఉరివేసి తక్షణ శిక్ష వేసి న్యాయం చేయాలని బాధిత కుటుంబం, బంధువులు డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆగ్రహంతో ఊగిపోతూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళనకారులను సముదాయించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు.
read more అటవీ శాఖ అధికారినిపై ఉన్నతాధికారి వేధింపులు... తెలంగాణ సీఎస్ కు బాధితురాలి లేఖ
ఈ అమానుషం గురించి తెలిసిన వెంటనే అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరావు స్పందించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన చిట్టిబాబుకు టిడిపి సభ్యత్వం వుందని... దాన్ని వెంటనే రద్దు చేస్తూ అతన్ని పార్టీలోంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. బాధిత బాలిక కుటుంబానికి టిడిపి అండగా వుంటుందని నాగ జగదీశ్వరరావు తెలిపారు.
ఇదిలావుంటే ఇదే అనకాపల్లి జిల్లాలో మరో అమానవీయ ఘటన వెలుగుచూసింది. కన్న కూతురిలా చూసుకోవాల్సిన బాలికపై మారుతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన చిన్నారి ఇంటికి వెళ్లడానికే భయపడిపోతుండటంతో తల్లి ఆరా తీయగా విషయం బయటపడింది.
సబ్బవరానికి చెందిన ఓ మహిళ భర్త తొమ్మిదేళ్ల కిందట మృతి చెందాడు. ఇద్దరు ఆడపిల్లలతో ఆమె మగదిక్కు లేకుండా జీవించలేకపోయింది. దీంతో సబ్బవరం సాయి నగర్ కాలనీకి చెందిన 34 ఏళ్ల వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అతని ద్వారా ఆమెకు మరో అమ్మాయి పుట్టింది. ముగ్గురు పిల్లలతో కలిసే దంపతులు జీవిస్తున్నారు. అయితే 13 ఏళ్ల పెద్దకూతురిపై కన్నేసిన మారుతండ్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు.
