Asianet News TeluguAsianet News Telugu

శ్రీవారి సాక్షిగా దళిత మంత్రికి అవమానం...జగన్ చేతుల్లోనే : కెఎస్ జవహర్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సామాన్య దళితులే దాడులకు గురవుతూ  అవమానింపబడుతున్నారని ఇప్పటివరకు ప్రజలంతా అనుకుంటున్నారని టిడిపి నాయకులు కెఎస్ జవహర్ అన్నారు. 

TDP Leader KS Jawahar Serious Comments on  AP CM YS Jagan
Author
Guntur, First Published Sep 25, 2020, 6:26 PM IST

గుంటూరు: తిరుమలలో కూడా జగన్ తన మొండితనాన్ని నిరూపించుకున్నాడని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తనపక్కన కూర్చోబెట్టుకుని మరోవైపు డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి మాత్రం కనీసం కుర్చీకూడా ఇవ్వకుండా అవమానించారని టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. దళితమంత్రి కాబట్టే ఆయనను తీవ్రంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

శుక్రవారం జవహర్ తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సామాన్య దళితులే దాడులకు గురవుతూ  అవమానింపబడుతున్నారని ఇప్పటివరకు ప్రజలంతా అనుకుంటున్నారని అన్నారు. కానీ దళిత మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా అదేవిధమైన అవమానాలు, ఛీత్కారాలు తప్పడం లేదని జగన్ తిరుమల పర్యటనతో తేలిపోయిందన్నారు. 

దళితులకు ఎంత విలువుందో  తిరుమలలో డిప్యూటీ సీఎం నారాయణస్వామిని చూస్తేనే అర్థమైందని... తన వర్గానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పక్కన కూర్చొబెట్టుకున్న సీఎం నారాయణస్వామికి మాత్రం కనీసం కుర్చీ కూడా ఇవ్వకుండా నిలుచోబెట్టడం ద్వారా తనలోని దళిత వ్యతిరేకతను మరోసారి నిరూపించుకున్నాడన్నారు.  

దళితులంతా జగన్ కు ఓటేసినందుకు ఇప్పటికే చెంపలు వేసుకుంటున్నారని, కనీసం దళితులైన ఎమ్మెల్యేలు, మంత్రులను పక్కన కూడా కూర్చోనివ్వకుండా జగన్ ప్రవర్తించిన తీరుతో దళితజాతి రక్తం ఉడికిపోతోందన్నారు. సంప్రదాయాలు, సంస్కృతులు, ఆచారాలను నమ్మకుండా, గౌరవించకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసిన జగన్, తన కుల అహంకారంతోనే నారాయణస్వామిని తనముందు నుంచోబెట్టాడన్నారు. బీహార్ మాదిరి కులఅహంకార ఆధిపత్యాన్ని జగన్ రాష్ట్రంలోకి తీసుకొస్తున్నాడన్నారు.  

read more   కుట్రలో భాగంగానే దేవాలయాలపై దాడులు: హోం మంత్రి సుచరిత

అధికారపార్టీకి చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోతే ముఖ్యమంత్రి కనీసం ఆయన కుటుంబాన్నికూడా పరామర్శించలేదన్నారు. ఓదార్పు పేరుతో ఇంటింటికీ తిరిగి అందరినీ అక్కున చేర్చుకున్న జగన్, తనపార్టీ ఎంపీ చనిపోతే పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. దళితులు, హిందూమతంపై జరుగుతున్న దాడులపై జగన్ మౌనంగా ఉండటం సరికాదన్న జవహర్,  ముఖ్యమంత్రి తీరుని దళితనేతలు, మంత్రులు ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు.  దళితనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా జగన్ అహంకారధోరణిపై ఆయన్ని ప్రశ్నించాలన్నారు. 

దుర్గాప్రసాద్ దళితుడు కాబట్టే ఎంపీ అయినా సరే జగన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికీ దళిత వ్యతిరేకే అనడంలో ఎటువంటి సందేహం లేదని మాజీమంత్రి తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా సెక్యులర్ భావాలతో  సమన్యాయం పాటిస్తే, ఆయనకే మంచిదని టీడీపీనేత హితవు పలికారు. సమాజానికి పట్టిన రుగ్మతలను ముఖ్యమంత్రే రూపుమాపకపోతే ఎలా అన్నారు. 

గతంలో దళితులందరినీ దేవాలయ ప్రవేశం చేయించినట్లుగానే, భవిష్యత్ లో దళిత నేతలను జగన్ ఛాంబర్ లోకి ప్రవేశింపచేయాల్సిన దుస్థితి వచ్చేలా ఉందని జవహర్ వాపోయారు. జగన్ తన కుసంస్కారాన్ని ప్రతిసారీ బయటపెట్టుకోకుండా, కనీసం ప్రజలకోసమైనా ఆయన సాటివారినిగౌరవిస్తే మంచిదన్నారు. రాజ్యాంగంలోని హక్కులను కాలరాసేలా ప్రవర్తించిన జగన్ ఇప్పటికైనా తనతప్పులను తెలుసుకుంటే మంచిదని జవహర్ హితవు పలికారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios