అనంతపురం: రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు కుట్రలో భాగమేనని రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత అభిప్రాయపడ్డారు.

శుక్రవారం నాడు ఆమె అనంతపురంలో మీడియాతో మాట్లాడారు.  ఏపీలో విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. దళితులపై దాడులు తగ్గాయన్నారు. తమ ప్రభుత్వానికి మంచి పేరు రావడం ఇష్టం లేకే కొందరు  జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేస్తోందన్నారు. తప్పు చేస్తే స్వంత పార్టీ నేతలను కూడ ఉపేక్షించవద్దని జగన్ ఆదేశించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

పోలీస్ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతోందన్నారు. ప్రతి గ్రామంలో మహిళా మిత్రలు, సచివాలయాల్లో పోలీసులు కార్యదర్శులు, నియామకాలు చేపట్టామన్నారు.

పోలీసులకు పకడ్బందీగా వీక్లీ ఆఫ్ లు అమలు చేస్తున్నామన్నారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఏపీ పోలీస్ సేవా యాప్ ద్వారా ప్రజల చెంతకే పోలీస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా ఆమె తెలిపారు.

దిశ యాప్ ను రాష్ట్రంలో ఇప్పటికే 11 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకొన్నారని ఆమె గుర్తు చేశారు.