గుంటూరు: రోజురోజుకీ దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని... ఇప్పటికే 20లక్షల కేసులు నమోదవగా దాదాపు 40వేల మంది మరణించారని టీడీపీనేత, ఆపార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో కేసులు అత్యధికంగా పెరుగుతున్నా మహారాష్ట్ర, తమిళనాడులు  అత్యధిక కరోనా కేసుల్లో మొదటి రెండు స్ధానాల్లో నిలిస్తే ఏపీ మూడోస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో రోజూ వేలసంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి... నిన్న ఒక్కరోజే 10,128కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. 

''గత వారంరోజుల కేసుల వివరాలు పరిశీలిస్తే, 56వేల కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత వారంలో 3లక్షల23వేల671 కేసులు నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో యావరేజ్ డెయిలీ గ్రోత్ రేట్ 2.82 శాతంగా ఉంటే రాష్ట్రంలో డెయిలీ యావరేజ్ గ్రోత్ రేటు 6.11శాతంగా ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఇక గత వారం రోజుల్లో మహారాష్ట్రలో  56,400కేసులు నమోదైతే మనరాష్ట్రంలోనూ 56వేల కేసులు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో డెయిలీ యావరేజ్ గ్రోత్ రేటు 1.95శాతమైతే మన రాష్ట్రంలో మాత్రం 6.11శాతంగా ఉంది. కర్ణాటకలో 3.95శాతం, తమిళనాడులో 1.99 శాతం, తెలంగాణలో 2.40శాతం గ్రోత్ రేట్ నమోదైంది'' అని వివరించారు.

READ MORE   కేసీఆర్ తో పెరిగిన దూరం...అందువల్లే జగన్ వెనక్కితగ్గేది..: టిడిపి ఎమ్మెల్యే సంచలనం

''కేసులతో మహారాష్ట్రలో సరిసమానంగా ఉన్న రాష్ట్రం గ్రోత్ రేట్ లో మాత్రం ఆరాష్ట్రం కంటేమూడురెట్లు ముందుందన్నారు. మరణాల పరంగా చూస్తే రాష్ట్రంలో ఈవారంలో 400లకు పైగా మరణించారు. నేషనల్ యావరేజ్ గ్రోత్ రేట్ ఇన్ డెత్స్ చూస్తే 1.97శాతముంటే, ఏపీలో మరణాల రేటు 4.46శాతంగా ఉంది. మరణాల రేటు మహారాష్ట్రలో 1.69శాతం, కర్ణాటకలో 3.67శాతం, తమిళనాడులో 2.30, తెలంగాణలో 2శాతం మాత్రమే ఉంది. మిగతారాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మరణాల రేటు కూడా అధికంగా ఉంది'' అని అన్నారు. 

''కేసుల పరంగా గ్రోత్ రేట్ 6.11శాతం, మరణాల పరంగా గ్రోత్ రేట్ 4.46శాతంగా ఉండటం మన దురదృష్టం, ఆందోళనకరం.
 ప్రతి పది సెకన్లకు రాష్ట్రంలో ఒక కేసు నమోదవుతుంటే ప్రతి గంటకు ముగ్గురు కరోనాతో మరణిస్తున్నారు. జాతీయస్థాయిలో రికవరీ శాతం 67.05శాతం ఉంటే రాష్ట్రంలో మాత్రం అతి తక్కువగా 55.9శాతం మాత్రమే ఉంది. కేసుల పెరుగుదలలో, మరణాల్లో నంబర్-1గా ఉన్న రాష్ట్రం రికవరీలో మాత్రం టాప్ టెన్ రాష్ట్రాల్లో ఆఖరున 9వ స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 65, తమిళనాడులో 78శాతం, తెలంగాణలో 71.3 ఉత్తరప్రదేశ్ లో 58 రికవరీ శాతం ఉంది'' అని తెలిపారు.

''కేసుల నమోదు పరంగా చూస్తే గత పదిరోజుల్లోనే రాష్ట్రంలో అధిక కేసులు నమోదయ్యాయి.  ఆగస్ట్ 4వతేదీన 9,747కేసులు రాష్ట్రంలో నమోదైతే జూలై 31న 10,300, జూలై 28న 8వేల కేసులు, 29వ తేదీన 10,093 కేసులు నమోదయ్యాయి.  గడిచిన 10రోజులు చూస్తే  దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యే రాష్ట్రాల్లో ఏపీ ముందుండటం దురదృష్టకరం''అని పట్టాభిరామ్ అన్నారు.