సారాంశం

తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతోనే తమపై దాడులు జరిగాయని.. పల్నాడులో నారా లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే కర్రలు ఇచ్చి దాడులను ప్రోత్సహించారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు టీడీపీ నేతలపై కేసులు సైతం నమోదు చేశారు. ఇదిలావుండగా.. ఈ ఘటనపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పందించారు. వినుకొండలో ఉద్దేశపూర్వకంగానే దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతోనే తమపై దాడులు జరిగాయని.. పల్నాడులో నారా లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. 

శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే కర్రలు ఇచ్చి దాడులను ప్రోత్సహించారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిస్ధితులు అదుపులో వున్నప్పటికీ సీఐ గాల్లోకి ఫైరింగ్ చేశారని.. ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేయాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. మాచర్లకు చెందిన వైసీపీ నేతలు వినుకొండలో హంగామా సృష్టిస్తే వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. బొల్లా బ్రహ్మనాయుడు నిజ స్వరూపం బయటపడిందని.. ఇకపై ఆయన్ను గుడ్డలూడదీసి రోడ్డుపై నిలబెడతామని ఆంజనేయులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ALso Read: నన్ను అంతమొందించి గెలవాలనే యత్నం: వినుకొండ ఘర్షణలపై ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు

అంతకుముందు ఎమ్మెల్యే బ్రహ్మానాయుడు మాట్లాడుతూ.. తనపై టీడీపీ శ్రేణులు దాడికి దిగినట్టుగా చెప్పారు. ఈ దాడిలో తన గన్ మెన్ కు గాయాలయ్యాయని  ఆయన తెలిపారు. వినుకొండలో వైసీపీ నేతలను చంపాలని టీడీపీ చూస్తుందని ఆయన  ఆరోపించారు. తనపై దాడిలో 400 మంది వరకు టీడీపీ  కార్యకర్తలు  పాల్గొన్నారని ఎమ్మెల్యే చెప్పారు. తనను  అంతమొందించి  వినుకొండలో విజయం సాధించాలని  టీడీపీ ప్రయత్నిస్తుందని  ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆరోపించారు. అధికారం కోసం టీడీపీ అల్లర్లు సృష్టిస్తుందన్నారు.