Asianet News TeluguAsianet News Telugu

ఆయనే రాష్ట్రానికి డిఫ్యాక్టో హోం, ఆర్థిక, ఇరిగేషన్ మంత్రి...: ఉమ సంచలనం

చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎందుకని జగన్ ప్రభుత్వానికి కనిపించడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ నిలదీశారు. 

TDP Leader devineni uma sensational comments on sajjala
Author
Vijayawada, First Published Sep 7, 2020, 9:36 PM IST

విజయవాడ:  వైసీపీ ప్రభుత్వానికి సాగునీటి రంగంపై అవగాహనలేదని ప్రజలకు అర్థమైందని, అధికారంలోకివచ్చి 15నెలలైనా పాలకులు ఇప్పటికీ తమ అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీపై, ఆ పార్టీ నేతలపై నిందలేస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. 

''గతంలో చంద్రబాబునాయుడు గండికోట రిజర్వాయర్ లో 12 టీఎంసీల నీరు నిల్వచేసి, పంతొమ్మిదిన్నర టీఎంసీల వరకు చుట్టుపక్కల ప్రాంతాలకు నీరందించారు. జగన్ ప్రభుత్వం వచ్చి 15నెలలైనా గండికోట ప్రాంత నిర్వాసితులకు జీవోలతో సరిపెట్టింది. వారికి నష్టపరిహారం చెల్లించడం చేతగాని జగన్ ప్రభుత్వం ప్రశ్నించేవారిని చంపేస్తామంటూ అహంకారంతో విర్రవీగుతోంది'' అని ఆరోపించారు. 

''చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎందుకని జగన్ ప్రభుత్వానికి కనిపించడం లేదు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన  192 పనులను ఎందుకు రద్దుచేశారు? రూ.2లక్షల కోట్లు ఖర్చుచేసిన జగన్ గండికోట నిర్వాసితులకు డబ్బులెందుకు ఇవ్వలేదు..? పోలవరం పనులు 72శాతం, పట్టిసీమ, తోటపల్లి రిజర్వాయర్, వంశధార-నాగావళి పనుల ఆరంభం వంటివి చంద్రబాబు చేసిచూపించాడు. ఈ ప్రభుత్వం వచ్చాక నీరంతా సముద్రం పాలవుతోంది తప్ప, చెరువులు, డ్యాములు నింపడం లేదు'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''అనంతపురం జిల్లాలో ఏ మూలకు వెళ్లి అడిగినా చంద్రబాబే తమకు నీరందించాడని చెబుతారు. కియా పరిశ్రమ వచ్చింది ఆయనవల్ల కాదా? ఎవరి కాలంలో పనితీరుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకు వచ్చిందో గ్రహించకుండా తమవల్లే వచ్చిందని డబ్బాలు కొట్టుకుంటే సరిపోతుందా?'' అని అన్నారు. 

''15నెలల్లో ఇరిగేషన్ శాఖకు ఎంతఖర్చుపెట్టారో, ఏమేం పనులు చేశారో చెప్పగలరా? కాంట్రాక్టులన్నీ తమవారికి కట్టబెడుతూ ప్రాజెక్టులను నీరుగార్చారు. చంద్రబాబు నాయుడి అనుభవం అంత వయస్సుకూడా లేని వారు పెద్దపెద్ద మాటలు మాట్లాడితే ఎలా?  గండికోట నిర్వాసితులకు పరిహారం ఇవ్వడానికి ఖజానాలో సొమ్ముందా? ఎవరు అప్పులిస్తారు..ఏ బ్యాంకు అప్పిస్తుంది.. ఏ కాంట్రాక్టర్ ముడుపులిస్తాడని ఆలోచిస్తున్నారు తప్ప 15నెలల్లో రోడ్లపై ఉన్న గుంతలు కూడా పూడ్చలేదు'' అని మండిపడ్డారు. 

''ఇరిగేషన్ మంత్రి అనిల్ చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో సీమకు సాగునీరు ఆపేస్తారా? రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు, వాటికింద సాగయ్యే భూమి ఎంత, పండే పంటలెన్ని వంటి వివరాలతో సమగ్ర సమాచారంతో తమ ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను ఇప్పుడు అధికారంలో ఉన్నవారు చదువుకుంటే మంచిది. ప్రజలకు సమాధానం చెప్పలేకే పాలకులు, ప్రతిపక్షంపై నిందలు వేస్తున్నారు'' అని అన్నారు. 

read more  మంత్రి పదవి దక్కక మతిభ్రమించి... 2 నెలల నుండి ఇంటికే: తమ్మినేనిపై కూన సెటైర్లు

''రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తున్న ప్రభుత్వం రేపు ఆ మోటార్లు, మీటర్లు చోరీకి గురైతే ఎవరిని బాధ్యులను చేస్తుంది. ఉచిత విద్యుత్ పథకానికి నీరుగార్చడానికే, ప్రభుత్వం నగదు బదిలీ అంటూ కొత్త నాటకం ఆడుతోంది. విజయవాడ మహానరంలోనే కరెంట్ కోతలుంటే రేపు మారుమూల గ్రామాలకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తారా? రైతాంగం ఇబ్బందుల్లో ఉంటే మీటర్లుపెట్టే కార్యక్రమం  ఇప్పుడెందుకు చేపట్టారు. కేవలం అప్పులు పుట్టించుకోవడానికే జగన్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధమైంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కూడా స్పష్టతలేదు'' అని ఉమ అనుమానాలు వ్యక్తం చేశారు. 

''వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో రైతు ముందుగా వడ్డీ కడితేనే రుణం ఇస్తున్నారు. ప్రభుత్వం తనవాటాగా చెల్లించాల్సిన సొమ్ము రూ.800కోట్లు రైతుల ఖాతాల్లో వేయాల్సి ఉంది. ఆ సొమ్ము ఇవ్వకుండా రైతులకు రుణాలు ఎలా వస్తాయి? రైతు రుణమాఫీ 4, 5 వ విడతల సొమ్ముని ఎందుకు ఎగ్గొట్టారు? సున్నా వడ్డీ పథకం పేరుతో రైతుల జీవితాలకు సున్నా చుట్టారు. కౌలురైతులకు చెల్లించే సొమ్ము విషయంలో కూడా ఈ ప్రభుత్వం కులాలు చూసింది. రేపు మోటార్లకు మీటర్లు బిగించే అంశంలో కూడా కౌలురైతులకు అన్యాయం చేస్తారు. మీటర్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలో స్పష్టత లేదని రైతుసంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడేందుకే జగన్ ప్రభుత్వం మీటర్లు బిగించేచర్యకు పూనుకుంది'' అని ఉమ ఆరోపించారు. 

''వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై రైతాంగం తిరగబడటం ఖాయం. చంద్రబాబు తన దూరదృష్టితో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీని మార్చారు. జగన్ వచ్చాకనే విద్యుత్ లోటు ఏర్పడింది. దేశమంతా సమృద్ధిగా వర్షాలు పడి, ప్రాజెక్టులకు నీరు వస్తే ఈప్రభుత్వం జలాలను సమగ్రంగా ఉపయోగించుకోలేకపోయింది. 10టీఎంసీలు నిలబడే వైకుంఠపురం బ్యారేజ్ ను ఈప్రభుత్వం ఎందుకు రద్దుచేసింది? గోదావరి పెన్నా అనుసంధానంలో భాగంగా చేపట్టిన బ్యారేజ్ నిర్మాణాన్ని ఆపడం దారుణం. సీఎఫ్ఎంఎస్ లో జరిగిన డబుల్ పేమెంట్స్ వ్యవహారంపై ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?'' అని నిలదీశారు. 

''ప్రస్తుతం రాష్ట్రానికి సజ్జల రామకృష్ణారెడ్డే డిఫ్యాక్టో ఆర్థికమంత్రి, డిఫ్యాక్టో హోంమినిస్టర్, ఢిప్యాక్టో ఇరిగేషన్ మినిస్టర్. అనిల్ కేవలం నెల్లూరు జిల్లా వ్యవహారాలకే పరిమితం. ప్రధాన ప్రతిపక్ష నేతగా, బాధ్యతగల రాజకీయనాయకుడిగా ప్రశ్నించడం నా బాధ్యత. నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే లారీలతో తొక్కిస్తామని బెదిరిస్తున్నారు. నన్నుఉద్దేశించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై డీజీపీ స్పందించలేదు. నానీ వ్యాఖ్యలను తప్పుపట్టినందుకు తమపార్టీ నేతలైన బ్రహ్మంచౌదరి, పిల్లి మాణిక్యరావును బెదిరిస్తున్నారు. జగన్ చర్యలు, నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం కరెక్ట్ కాదు'' అని సూచించారు. 

''ఈవీఎంల పుణ్యమో, పక్కరాష్ట్రాల పుణ్యమో తెలియదు గానీ జగన్ ముఖ్యమంత్రయ్యాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోటస్ పాండ్ వదిలి బయటకు రాలేదు. అది తెలియకుండా వైసీపీనేతలు మాట్లాడితే చంద్రబాబుపై పడి ఏడుస్తారెందుకు? చంద్రబాబు తన బాధ్యతను తాను సక్రమంగానే నిర్వహిస్తున్నాడు. మీ ప్రభుత్వం అంతా బాగా ఏడిస్తే నిన్న ఒక్కరోజే 10,754 కరోనా కేసులు ఎందుకొస్తాయి?  4,417 మంది ఎందుకు చనిపోయారు? కరోనా ఈ విధంగా ప్రజలను బలి తీసుకుంటుంటే  జగన్ ఒక్కరోజైనా కరోనా ఆసుపత్రికి వెళ్లి, బాధితులను పరామర్శించారా?'' అని అడిగారు. 

''తాడేపల్లి రాజప్రాసాదం వదిలి బయటకు వస్తే సీఎంకు ప్రజల సమస్యలు తెలుస్తాయి. ధాన్యం రైతులకు ఇప్పటికీ ఇంకా రూ.170కోట్లు, పసుపు రైతులకు రూ.90కోట్లు చెల్లించాలి. దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పదు.  ఒకవైపు రైతులకు ద్రోహం చేస్తూ, ఇంకా సిగ్గులేకుండా రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటారా ? రాజధాని రైతులు ఆందోళన చేస్తుంటే వారిని అడ్డుకోవడం ఏమిటి? పోలీస్ రాజ్యంలో రైతులను, దళితులను దుర్మార్గంగా వేధిస్తారా? చంద్రబాబు కట్టిన సెక్రటేరియట్ లో ఉండి పాలనచేస్తూ ఆయన నిర్ణయాలను తప్పుపడతారా?  తనప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెబుతాడా లేక డిఫ్యాక్టో ఇరిగేషన్ మంత్రి చెబుతాడా?'' అని ఉమ ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios