Asianet News TeluguAsianet News Telugu

మంత్రి పదవి దక్కక మతిభ్రమించి... 2 నెలల నుండి ఇంటికే: తమ్మినేనిపై కూన సెటైర్లు

కేబినెట్ విస్తరణ తర్వాత 2 నెలల పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటి గడప కూడా దాటలేదని టిడిపి నాయకులు కూన రవికుమార్ ఆరోపించారు. 

kuna ravikumar satires on tammineni sitharam
Author
Amaravathi, First Published Sep 7, 2020, 8:39 PM IST

విశాఖపట్నం: ప్రభుత్వ, ప్రతిపక్షాలకు వారధిగా వ్యవహరించవలసిన శాసన సభాపతి తమ్మినేని సీతారాం స్వార్థ రాజకీయ లబ్ధి కోసం దిగజారి మాట్లాడుతున్నారని మాజీ విప్, టిడిపి నాయకులు కూన రవికుమార్ ఆరోపించారు. ఆయన దిగజారడమే కాకుండా గౌరవ స్పీకర్ వ్యవస్థనే దిగజారుస్తూ మాట్లాడటం బాధాకరంగా వుందన్నారు. మరీ ముఖ్యంగా మంత్రి పదవి దక్కని నాటి నుంచి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

''కేబినెట్ విస్తరణ తర్వాత 2 నెలల పాటు స్పీకర్ ఇంటి గడప కూడా దాటలేదు. సమయం దొరికినప్పుడల్లా ఆ అక్కసును ఒక్కో వ్యవస్థపై చూపుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు గృహ నిర్మాణాలపై పడ్డారు'' అని స్పీకర్ వ్యవహారశైలిపై మండిపడ్డారు. 

''ఇళ్ల పట్టాల పంపిణీపై జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల‌పై రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ఇందుకు మీ పార్టీ నాయకులు కోర్టుల‌లో ఫైల్ చేస్తున్న‌ కేసులే నిద‌ర్శనం. అనపర్తిలో మాజీ జ‌డ్పీటీసీ, ప్రస్తుత ఎమ్మెల్యేకి ప్రధాన అనుచ‌రుడు అయిన క‌త్తి భ‌గ‌వాన్ రెడ్డి వేసిన ప‌బ్లిక్ ఇంట్రస్ట్ లిటికేష‌నే ఇందుకు ఉదాహరణ. భూసేక‌ర‌ణ‌లో అవినీతి జ‌రిగింద‌ని, సేక‌రించిన భూముల చ‌దునులో అక్రమాలు చోటుచేసుకున్నాయ‌ని, ల‌బ్ధిదారుల ఎంపిక సైతం లోప‌భూయిష్టంగా జ‌రిగింద‌ని సాక్షాత్తూ మీ నాయ‌కులే ఆరోపిస్తున్నారు. దీనికేం స‌మాధానం చెబుతారు..?'' అని కూన ప్రశ్నించారు. 

read more   ఆ మంత్రి కండలు చూసి క్యూ కడుతున్నారా... బ్లూ మీడియా చెప్పేదిదేనా?: బుద్దా సెటైర్లు

''అభివృద్ధికి టీడీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదు. మీ నాయ‌కులే మీపై కేసులు వేస్తుంటే... తెలుగుదేశం శ్రేణుల‌పై అభాండాలు మోపుతారా..? భూప‌ట్టాల కార్యక్రమంలో చేయాల్సిన అవినీతంతా చేశారు. దీనిపై మీ పార్టీ నాయ‌కులే కోర్టులకు వెళ్లేసరికి గుడ్డకాల్చి టిడిపి ముఖాన వేయాల‌ని చూస్తారా..? ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతిపై జిల్లాకో నేత చొప్పున వైకాపా నాయకులే కోర్టులలో కేసులు వేసింది వాస్తవం కాదా..?'' అని నిలదీశారు. 

''అభివృద్ధిని అడ్డుకోవడం మీ పార్టీ డీఎన్ఏలోనే ఉంది. కానీ ఊసరవెళ్లిలా  రంగులు మారుస్తూ నిందారోపణలు తెలుగుదేశం పైన మోపుతారా..? మీ ఆర్భాటపు ప్రచారం కోసం తెలుగుదేశం హయాంలో పూర్తయిన దాదాపు 6 లక్షల ఇళ్లను పాడుబెడుతున్నారు. ఇది మంచి పద్ధతో, కాదో మీరే చెప్పండి'' అని అన్నారు. 

''దశాబ్ధాల తరబడి దళిత, బడుగు బలహీన వర్గాలు ప్రజలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడంతో వారంతా కోర్టులను ఆశ్రయించారు. మడ అడవులను కొట్టేసి భారీ అవినీతికి పాల్పడ్డారు. ఆవ భూముల్లో రూ.400 కోట్లు మింగేశారు. రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ కు విరుద్ధంగా పశువుల మేత భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడం, తూ.గో జిల్లా శ్రీ రాజమహేంద్రవర వైశ్య సేవా సాధన సంఘానికి చెందిన 32 ఎకరాల భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ప్రకాశం జిల్లా టంగుటూరులో 1,307 ఎకరాల మైనింగ్ భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించడంపై హైకోర్టు గట్టిగా మొట్టికాయలు వేసింది. అయినా అది తప్పని మీ మట్టి బుర్రలకి నేటికీ అర్థం కాకపోవడం బాధాకరం'' అని గుర్తుచేశారు. 

''దమ్ముంటే ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడంలో టీడీపీ ప్రమేయం ఎక్కడుందో నిరూపించండి, వాస్తవాలను బయటపెట్టండి. అంతేగానీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ.. వాస్తవాలను వక్రీకరించడం సరికాదు'' అని తమ్మినేనికి కూన సూచించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios