Asianet News TeluguAsianet News Telugu

మాజీ మంత్రి దేవినేని ఉమ హౌస్ అరెస్ట్... గొల్లపూడిలో ఉద్రిక్తత (వీడియో)

తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. గొల్లపూడిలోని ఆయన ఇంటివద్ద భారీగా పోలీసులను మొహరించి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. 

TDP Leader Devineni Uma House arrest AKP VJA
Author
First Published Aug 30, 2023, 9:51 AM IST

విజయవాడ : మాజీ మంత్రి, టిడిపి నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ఇవాళ తెల్లవారుజామునే గొల్లపూడిలోని మాజీ మంత్రి ఇంటివద్దకు చేరుకున్న పోలీసులు ఆయనను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో టిడిపి శ్రేణులు, పోలీసులకు మద్య వాగ్వాదం జరిగి గొల్లపూడిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల హౌస్ అరెస్ట్ తో మాజీ మంత్రి తన ఇంటివద్దే నిరసనకు దిగారు. 

అధికార వైసిపి ఇసుక దోపీడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ గత రెండ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం కూడా నిరసనలు కొనసాగించేందుకు టిడిపి నాయకులు సిద్దమయ్యారు. ఇలా ఇవాళ ఇబ్రహీంపట్నంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి టిడిపి పిలుపునిచ్చింది. వైసిపి నాయకుల ఇసుకదోపిడీకి సంబంధించిన ఆధారాలను డిఎంజి డైరెక్టర్ కు అందజేయాలని టిడిపి నాయకులు భావించారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో దేవినేని ఉమ ఇంటివద్దే నిరసన చేపట్టారు. 

వీడియో

ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ...  ఏపీలో ఇసుక దోపిడీని అరికట్టేందుకు ఉప్పు సత్యాగ్రహం లాగే ఇసుక సత్యాగ్రహం  చేయాల్సి వస్తోందన్నారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జాతిపిత మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసారని... ఈనాడు వైఎస్ జగన్ రాక్షస పాలనలో ఇసుక సత్యాగ్రహం చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే రూ.40 వేల కోట్ల ఇసుక డబ్బులు జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయని మాజీ మంత్రి ఆరోపించారు. 

Read More  మేం గేట్లు ఎత్తితే చాలు.. వైసీపీ కాస్తా టీడీపీగా మారిపోతుంది : చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు

వైసిపి అధికారంలోకి వచ్చినవెంటనే ఇసుక అమ్మకాల కోసం కొత్త పాలసీ తీసుకువస్తానంటే ప్రజలంతా నమ్మారని అన్నారు. కానీ ఇసుకను దోచుకోవడమే ఆ కొత్తపాలసీ అని తర్వాత అర్థమయ్యిందన్నారు. వైసిపి నాయకులు మైనింగ్ డిపార్ట్మెంట్ ను అడ్డంపెట్టుకుని ఇసుక దోపిడి చేస్తున్నారని... ఆ దోపిడీ సొమ్ములో అధికభాగం తాడేపల్లి ప్యాలెస్ కు కప్పం కడుతున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. 

 ఏపీలో సామాన్యుడు, పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. భవన నిర్మాణ కార్మికులు  ఉపాధి లేకుండా వ్యవస్థ మొత్తం కుప్పకూలిందని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు.  సీఎం జగన్మోహన్ రెడ్డి ఇసుకాసురుడు లాగా ఇసుక డబ్బులు దోచేస్తున్నాడని దేవినేని ఉమ ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios