టీడీపీ గేట్లు తెరిస్తే చాలు, వైసీపీ కాస్తా టీడీపీగా మారిపోతుందని చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఏపీకి జగన్మోహన్ రెడ్డే అతిపెద్ద సమస్య అని.. విభజన కంటే దారుణంగా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాను కేంద్రంతో విభేదించింది కేవలం ప్రత్యేక హోదా మీదనే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాలతో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక అనుబంధం వుందన్నారు. తమ పార్టీ ఎప్పుడూ జాతీయ భావంతో వుండే పార్టీ అన్నారు. ప్రత్యేక హోదా తప్పించి మిగిలిన అంశాలలో తనకు కేంద్రంతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. ఏపీకి జగన్మోహన్ రెడ్డే అతిపెద్ద సమస్య అని.. విభజన కంటే దారుణంగా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పోతేనే రాష్ట్రం బాగుపడుతుందని.. టీడీపీ గేట్లు తెరిస్తే చాలు, వైసీపీ కాస్తా టీడీపీగా మారిపోతుందని చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు.. ఏపీ, తెలంగాణల్లో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో అవసరాన్ని బట్టి పొత్తులు వుంటాయన్న చంద్రబాబు.. తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని అన్నారు. పొత్తులపై చర్చలకు సమయం మించిపోయిందన్నారు. తెలంగాణలో ఎన్ని స్థానాల్లో పోటీ చేసేది కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు చంద్రబాబు . 119 స్థానాల్లో పోటీ చేయాలా లేక కొన్ని చోట్లే చేయాలా అన్నది కమిటీ తేలుస్తుందన్నారు. 

Also Read: తెలంగాణలో ఒంటరిగా పోటీ, ఎపిలో అవసరాన్ని బట్టి పొత్తులు: చంద్రబాబు

తెలంగాణలో బీజేపీ లేదా బీఆర్ఎస్‌లతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు భావించారు. కానీ ఆయన వ్యూహాలు ఫలించలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో టీడీపీ చీఫ్ ఆశలు ఆవిరయ్యాయి. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి చంద్రబాబే కారణమంటూ ఓ రేంజ్‌లో ఉతికేశారు కేసీఆర్. ఇక బీజేపీతో పొత్తు విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో చంద్రబాబు వల్ల కాంగ్రెస్ విజయావకాశాలకు గండిపడగా , ఆంధ్రా బూచీ చూపి సెంటిమెంట్‌ను రగిల్చి మరోసారి గెలిచారు కేసీఆర్.

ఆంధ్రా విషయానికి వస్తే.. జనసేన, టీడీపీ, బీజేపీలు కూటమిగా బరిలోకి దిగుతాయని ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో జనసేన, టీడీపీలు సూత్రప్రాయంగా పొత్తులకు ఆమోదం తెలిపాయి. కానీ బీజేపీ నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. చంద్రబాబు వైఖరితో విసిగిపోయిన కమలనాథులు ఆయనతో పొత్తంటే భయపడుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకు ప్రయత్నించినా సానుకూల స్పందన లభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.