మంగళగిరిలోని  ఏపీ మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట జనసేన వీరమహిళలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది.

మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట జనసేన వీరమహిళలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అనుచిత వ్యాఖ్యాలు చేశారంటూ జనసేన వీరమహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి మహిళ కమిషన్ కార్యాలయంకు ర్యాలీగా బయలుదేరారు. మహిళా కమిషన్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. అయితే వారు పోలీసులను దాటుకుని మహిళా కమిషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

 ఈ క్రమంలోనే పోలీసులకు, జనసేన వీరమహిళలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ జనసేన వీరమహిళలు మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలోనే పోలీసులు జనసేన వీరమహిళలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు వాసిరెడ్డి పద్మ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

వాసిరెడ్డి పద్మ దమ్ముంటే రమ్మని అంటారని.. ఇప్పుడు వస్తే మాత్రం పోలీసులతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వాసిరెడ్డి పద్మ చర్చకు సిద్దమా అని అంటున్నారని.. అందుకే తాము మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చామని.. ఆమె తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.