గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి కరోనాకు పాజిటివ్ గా  నిర్దారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన గుంటూరు  రమేశ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే అచ్చెన్నాయుడు కరోనా బారిన పడటంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. 

 ''పార్టీ సీనియర్ నాయకుడు మరియు సన్నిహితుడు అచ్చెన్నాయుడు గారికి కోవిడ్_19 పాజిటివ్ వచ్చిందని తెలిసి చాలా బాధ పడుతున్నాను.  ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను'' అంటూ అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ట్వీట్ చేశారు.

read more   అసంపూర్తే: రాష్ట్ర విభజనపై జగన్ సర్కార్ సంచలన వాదన

అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్ధితిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా స్పందించారు. అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆపరేషన్ అయ్యిందని తెలిసి కూడా అచ్చెన్నను ఇబ్బంది పెడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి వల్లే అచ్చెన్నాయుడు కరోనా బారిన పడ్డారని ఆయన ట్వీట్ చేశారు. 

ఇక అచ్చెన్నాయుడికి కరోనా రావడానికి ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.  శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిని ప్రభుత్వం కనికరం లేకుండా దుర్మార్గంగా అటూఇటూ తరలించడం వల్లే అచ్చెన్నాయుడి ఆరోగ్యం దెబ్బతిన్నదన్నారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను వేధిస్తోందన్నారు. పాలకులు ఇప్పటికైనా బ్లీచింగ్ పౌడర్, పారాసిట్మాల్ అనే తమ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి కరోనా రోగులకు ఉత్తతమైన వైద్యసేవలందించాలని ఉమా హితవు పలికారు.