రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రానిదా..? కేంద్రానిదా అన్నదానిపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని కేంద్రం తన కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొందని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

రాజధాని సహా అన్ని అభివృద్ధి పనులు, ప్రణాళికలు, ప్రాజెక్టులను సమీక్షించే విస్త్రతాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది. రాజధాని తరలింపుపై పిటిషనర్లు చెబుతున్న అభ్యంతరాలు పరిగణనలోనికి రావని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనంతకాలం విభజన ప్రక్రియ అసంతృప్తిగానే ఉన్నట్లే భావిస్తున్నానని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. హోదా గురించి ప్రతి మీటింగ్‌లో అడుగుతున్నామని, తెలిపింది.

హోదా అంశం కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య అపరిష్కృత అంశంగా ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రాజధాని అంశానికి సంబంధించిన పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన పలు పిటిషన్లకు సంబంధించి ఇటీవల హైకోర్టు సైతం రాజధాని నిర్ణయం కేంద్రానిదా, రాష్ట్ర ప్రభుత్వానిదా అన్నదానిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

దీనిలో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దీనిలో రాష్ట్రాల రాజధాని నిర్ణయం ఆయా ప్రభుత్వాల అధీనంలోనే వుంటాయని, వీటిలో తమకు ఎటువంటి పాత్రా వుండదని తెలిపింది.