నారా లోకేష్ పర్యటనకు దూరం: టీడీపీకి దూళిపాళ్ల నరేంద్ర షాక్?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తే మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కనిపించకపోవడంపై చర్చ జరుగుతుంది. లోకేష్ చూట్టూ మాజీమంత్రులు, ఇతర నేతలు కనిపించారే తప్ప ధూళిపాళ్ల నరేంద్ర కనిపించకపోవడంపై నెల్లూరు రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఎన్నడూ లేనివిధంగా నేతలు ఒక్కక్కరిగా హ్యాండ్ ఇస్తున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లు పార్టీకి గుడ్ బై చెప్పగా....మరోనేత అదేబాటలో పయనిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది.
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత అయిన ధూళిపాళ్ల నరేంద్ర టీడీపీని వీడుతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన అనంతరం ధూళిపాళ్ల నరేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు.
అయినప్పటికీ పార్టీ అధికారంలో ఉండటంతో కీలకంగానే వ్యవహరించారు. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవ్వడంతోపాటు ఆయన కూడా పరాజయం చవిచూశారు. ఐదుసార్లు గెలిచిన ఆయన వైసీపీ వేవ్ లో కొట్టుకుపోయారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాస్త సైలెంట్ గానే ఉంటున్నారు. నేనున్నానని నిరూపించుకునేందుకు అప్పుడప్పుడు ఓ మెరుపులా మెరుస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం పర్యటించారు.
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డ టీడీపీ కార్యకర్త కార్తీక్ కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించారు. కార్తీక్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరపున వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు నారా లోకేష్.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తే మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కనిపించకపోవడంపై చర్చ జరుగుతుంది. లోకేష్ చూట్టూ మాజీమంత్రులు, ఇతర నేతలు కనిపించారే తప్ప ధూళిపాళ్ల నరేంద్ర కనిపించకపోవడంపై నెల్లూరు రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఇలా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మిస్ అవ్వడం మెుదటిసారి కాదు..ఇది రెండోసారి. నవంబర్ 13న ధూళిపాళ్ల నరేంద్ర సొంత నియోజకవర్గం అయిన పొన్నూరు నియోజకవర్గంలోనూ లోకేష్ పర్యటించారు.
పొన్నూరులో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు రవి కుటుంబ సభ్యులను నారా లోకేష్ పరామర్శించారు. ఇసుక కొరతతో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు అడపా రవి కుటుంబానికి లోకేష్ ఆర్థిక సహాయం అందజేశారు. టీడీపీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.
ఆ పర్యటనలో సైతం ధూళిపాళ్ల కనుచూపు మేరలో కానరాలేదు. ఆ సమయంలో లోకేష్‌తో పాటు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, మాణిక్య వరప్రసాద్, జీవీ ఆంజనేయులు ఉన్నారే కానీ ధూళిపాళ్ల మాత్రం మిస్ అయ్యారు.
లోకేష్ టూర్‌కు ధూళిపాళ్ల ఎందుకు రాలేదన్న అంశంపై అప్పుడు ఇప్పుడూ హాట్ టాపిక్ గా చర్చ జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో నారా లోకేష్ పర్యటించారు. రెండుసార్లు కూడా లోకేష్ టూర్‌లో నరేంద్ర కనిపించకపోవడంపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతుంది.
దీనికంతటికి పార్టీలో ఆధిపత్య పోరే కారణమని ప్రచారం జరుగుతుంది. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం మాజీమంత్రి ఆళ్లపాటి రాజాతో పాటు ధూళిపాళ్ల నరేంద్ర కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ నేతలిద్దరి మధ్య జిల్లా అధ్యక్ష పదవిపై పోరు నడుస్తోంది.
లోకేష్ ను ఆలపాటి రాజా తీసుకువస్తున్నారని తెలియడంతోనే ధూళిపాళ్ల నరేంద్ర డుమ్మా కొట్టారని ప్రచారం జరుగుతుంది. ఆళ్లపాటి, ధూళిపాళ్ల మధ్య నడుస్తున్న వర్గపోరు వల్లే హాజరు కాలేకపోయారని ప్రచారం జరుగుతుంది.
మరోపక్క ధూళిపాళ్ల నరేంద్ర అసంతృప్తితో ఉన్నారని తెలుసుకున్న కొందరు వైసీపీ నేతలు పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారని కూడా తెలుస్తోంది. వైసీపీలో చేరే అంశాన్ని కూడా ధూళిపాళ్ల నరేంద్ర కొట్టిపారేయలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
అసలు ధూళిపాళ్ల నారా లోకేష్ టూర్ కి ఎందుకు రాలేదు, పార్టీలో వర్గపోరు వల్లే హాజరు కాలేదా....లేక పార్టీపట్ల అసంతృప్తితో ఉన్నారా....వైసీపీలో చేరేందుకు వ్యూహరచన చేస్తున్నారా ఇవన్నీ అనుమానాలకు తెరదించాలంటే ధూళిపాళ్ల పెదవి విప్పాల్సిందేనని సోషల్ మీడియాలో నెటిజన్లు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
జూ.ఎన్టీఆర్ ది ముగిసిన కథ, వంశీ నీకు సిగ్గుందా: నారా లోకేష్ ధ్వజం
చంద్రబాబు ఇసుక దీక్షకు ఎమ్మెల్యేల డుమ్మా : ఏమవుతోంది...?
video news : దొంగఓట్లు వేయిస్తుంటే అడ్డుపడ్డందుకే