Asianet News TeluguAsianet News Telugu

(వీడియో) నంద్యాలలో టిడిపి ఎన్ని అడ్డుదారులు తొక్కుతోందో?

  • టిడిపి తరపున బిటెక్ చదువుతున్న పలువురు విద్యార్ధులు అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా ప్రచారం మొదలుపెట్టారు.
  • అయితే, ప్రచారంలో వీరు అభ్యర్ధికి ఓట్లు వేయాలని అడగటం పోయి ఓటర్లను భయపడుతుండటమే విచిత్రంగా ఉంది.
  • వివిధ వార్డుల్లో తిరుగుతున్న వీరు పలువురు ఓటర్లకు చెందిన ఆధార్ కార్డుల కాపీలు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను పట్టుకుని ఇంటింటికి తిరుగుతున్నారు.
Tdp doing all wrong things in nandyala

నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ టిడిపి మరీ రెచ్చి పోతోంది. గెలుపుకు అడ్డదారులన్నీ తొక్కుతోంది. శుక్రవారం నంద్యాల పట్టణంలో జరిగిన ఘటనలే అందుకు సాక్ష్యాలుగా నిలిచాయి. టిడిపి తరపున బిటెక్ చదువుతున్న పలువురు విద్యార్ధులు అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా ప్రచారం మొదలుపెట్టారు. అయితే, ప్రచారంలో వీరు అభ్యర్ధికి ఓట్లు వేయాలని అడగటం పోయి ఓటర్లను భయపడుతుండటమే విచిత్రంగా ఉంది. వివిధ వార్డుల్లో తిరుగుతున్న వీరు పలువురు ఓటర్లకు చెందిన ఆధార్ కార్డుల కాపీలు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను పట్టుకుని ఇంటింటికి తిరుగుతున్నారు.

టిడిపికి గనుక ఓట్లేయకపోతే వెంటనే రేషన్ కట్ చేస్తామంటూ బెదిరింపులు మొదలుపెట్టారు. ఓటర్లతో మాట్లాడుతూ, ’మీ సమాచారం మొత్తం తమ వద్దుందని’ బెదిరిస్తున్నారు. వీరు ప్రధానంగా ముస్లింలు ఎక్కువున్న ప్రాంతాలను, వృద్ధులను లక్ష్యంగ చేసుకుని ప్రచారం చేస్తున్నారు. అయితే, విషయం ఆనోటా ఈనోటా బయటకు పొక్కింది. దాంతో వైసీపీ నేతలు వీరిపై నిఘా పెట్టారు. అయితే ఈ విషయం తెలియని బిటెక్ బ్యాచ్ తమ మానాన తమ ప్రాచారాన్ని చేసుకుంటూనే ఉన్నారు.

కొద్దిసేపు వీరి వ్యవహారాన్ని గమనించిన వైసీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్ఛార్జ్, నంద్యాలలో ప్రచారంలో ఉన్న బుడ్డా శేషారెడ్డి తన మద్దతుదారులతో ఒక్కసారిగా వీరిపై దాడిచేసి పట్టుకున్నారు. దాంతో ఉలిక్కిపడిన వీరు తప్పించుకోవాలని చూసారు. సాధ్యం కాకపోవటంతో తాము సర్వే కోసమే వచ్చామంటూ బుకాయించటం మొదలుపెట్టారు. ఏ సంస్ధ తరపున సర్వే చేస్తున్నారో చెప్పమంటూ నిలదీసేసారు. అదే సమయంలో బిటెక్ బ్యాచ్ బెదిరింపులకు గురైన వాళ్లందరూ వచ్చేటప్పటికీ  చేసేది లేక చివరకు కాళ్ల బేరానికి దిగారు. తాము చేసింది తప్పేనంటూ కాళ్ళు పట్టుకున్నారు. దాంతో వీరివద్ద ఉన్న జిరాక్స్ కాపీలన్నింటినీ వైసీపీ నేతలు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.

అంతేకాకుండా, టిడిపి నేతలు కిరాయికి బయటప్రాంతాల నుండి మనుషును తీసుకొచ్చిన విషయం కూడా బయటపడింది. తీసుకొచ్చిన జనాలకు టిడిపి నేతలు టోకెన్లు పంపిణీ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వీరిని కూడా వైసీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ టిడిపి నేతలు చేస్తున్న జిమ్మిక్కులు అనేకం జరుగుతున్నాయి. ఇదిలావుండగా, మంత్రి భూమా అఖిలప్రియను నంద్యాలలోని 9వ వార్డులో జనాలు నిలదీయటం కలకలం రేపింది. పోయిన ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేసి గెలిపిస్తే చివరకు టిడిపిలోకి ఫిరాయిస్తారా అంటూ జనాలు మండిపడ్డారు. దాంతో చేసేది లేక ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి మంత్రి వెళ్లిపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios