గుంటూరు: ఎన్టీఆర్ హయాంలోనే తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని తీసుకొచ్చారని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తాము ఏనాడు అధికార దుర్వినియోగం చేయలేదని అన్నారు. కానీ వైసిపి నాయకులు విలువైన శ్రీవారి ఆస్తులను కారుచౌకగా కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని... తిరుమల పుణ్యక్షేత్రమని ఆ పార్టీ నేతలు గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. 

టిడిపి మహానాడులో భాగంగా టిటిడి భూముల అమ్మకాలపై  చర్చ జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ...తిరుమల ప్రాశస్త్యాన్ని కాపాడుకుందామని సూచించారు. గతంలో తిరుమలకు ఏడుకొండలు ఎందుకని వైఎస్ అన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించామని గుర్తుచేశారు. 

ధన దాహంతో శ్రీవారి ఆస్తులను కొట్టేయాలని వైసీపీ చూడటం నీచమన్నారు.  పింక్ డైమండ్ విషయంలో తమపై  వైసిపి  నాయకులు గతంలొ అసత్య ప్రచారం చేశారని అన్నారు. ఇప్పుడు తిరుమల పవిత్రతను అపవిత్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూని బల్క్ గా విక్రయించడమేంటి? అని ప్రశ్నించారు. ఇప్పటికే సింహాచలంలో భూములు కబ్జా చేశారని ఆరోపించారు. 

read more హిందువుల కోసం ఆ ఒక్కటీ చేయండి... చరిత్రలో మిగిలిపోతారు..: జగన్ కు పరిపూర్ణానంద సూచన

ఇటీవలే టీటీడీ ఆస్తుల విక్రయాల ప్రక్రియను నిలిపివేస్తూ టీటీడీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో సింఘాల్‌ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. వేలం నిర్వహణకు నియమించిన రెండు బృందాలను కూడా రద్దు చేస్తూ టీటీడీ ఈవో ఆదేశించారు. అలాగే ఆన్‌లైన్‌ వేలం ప్రక్రియను రద్దు చేస్తూ టిటిడి ఆదేశాలు జారీ చేసింది. 

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన టీటీడీ భూముల అమ్మకంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూముల వేలం ప్రక్రియను నిలుపుదల చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 30న అప్పటి టీటీడీ బోర్డు చేసిన తీర్మానాన్ని నిలుపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

జనవరి 30న చేసిన తీర్మానంలో 50 చోట్ల భూములు అమ్మాలని అప్పటి బోర్డు తీర్మానించింది. అలాగే భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని టీటీడీ బోర్డుకు సూచించింది.అలాగే  ఆధ్యాత్మిక వేత్తలు, ధర్మ ప్రచారకులతో సంప్రదింపులు జరపాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకు భూముల వేలం ప్రక్రియ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

భూముల అమ్మకం వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై వస్తున్న వార్తలు బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల వెంకన్నతో కొందరు రాజకీయాలు చేస్తున్నారని.. అలాంటివి మానుకోవాలని సుబ్బారెడ్డి హితవు పలికారు.