Asianet News TeluguAsianet News Telugu

హిందువుల కోసం ఆ ఒక్కటీ చేయండి... చరిత్రలో మిగిలిపోతారు..: జగన్ కు పరిపూర్ణానంద సూచన

టిటిడి భూముల విషయంలో కొనసాగుతున్న వివాదంపై స్వామి పరిపూర్ణానంద స్పందించారు.  

Paripurnananda Swamy Reacts on TTD Lands Issue
Author
Tirupati, First Published May 26, 2020, 7:04 PM IST

అమరావతి: భారతదేశంలోని ప్రముఖ హిందూ దేవాలయాల్లో టిటిడి అతి ముఖ్యమైనది. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులే కాదు ఆస్తులూ ఎక్కువగానే వున్నాయి. అయితే వెంకటేశ్వర స్వామికి భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకున్న ఆస్తులపై అధికార వైసిపి నాయకులు కన్నేశారని ప్రతిపక్షాలు  ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా విలువైన భూములను అమ్ముకోడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. 

టిటిడి భూములకు సంబంధించిన ఈ వివాదంపై సామాన్యప్రజలు, రాజకీయ పార్టీలే కాకుండా హిందూ ధార్మిక సంస్థలు, హిందూమత  పెద్దలు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై స్వామి పరిపూర్ణానంద కూడా స్పందించారు. టీటీడీ భూముల విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశారు.

''హిందూ బంధువుల ఆందోళన  రాకముందే వేలం నిలిపి నందుకు మీకు కృతజ్ఞతలు. ఇప్పటిదాకా పని చేసిన సీఎంలు దేవుళ్లకు, హిందువులకు ఒరగబెట్టింది ఏమీలేదు. వారి నిర్వాకం వల్లే 5 లక్షల కోట్ల పంట భూములు, లెక్కలేని ఆభరణాలు దోపిడీ కాబడ్డాయి అన్నది అక్షర సత్యం. కాబట్టి దేవాలయ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయండి.  ప్రజలు అందించిన ఆస్తులు వివరాలు వారికి తెలియ చెప్పడంలో తప్పులేదు. ఇప్పటి వరకు ఎవరు చెయ్యని ఈ పని మీరు చేస్తే నమ్మి ఓటు వేసిన హిందువులందరికీ న్యాయం చేసినవారవుతారు. చరిత్రలో మిగిలిపోతారు'' అని ముఖ్యమంత్రికి పరిపూర్ణానంద సూచించారు.

read more  టీటీడీ ఆస్తులను కాపాడాలంటూ కన్నా లక్ష్మీనారాయణ ఉపవాస దీక్ష

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన టీటీడీ భూముల అమ్మకంపై వివాదం చెలరేగడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూముల వేలం ప్రక్రియను నిలుపుదల చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 30న అప్పటి టీటీడీ బోర్డు చేసిన తీర్మానాన్ని నిలుపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

జనవరి 30న చేసిన తీర్మానంలో 50 చోట్ల భూములు అమ్మాలని అప్పటి బోర్డు తీర్మానించింది. అలాగే భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని టీటీడీ బోర్డుకు సూచించింది.అలాగే  ఆధ్యాత్మిక వేత్తలు, ధర్మ ప్రచారకులతో సంప్రదింపులు జరపాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకు భూముల వేలం ప్రక్రియ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

టిటిడి భూములకు సంబంధించిన వివాదంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై వస్తున్న వార్తలు బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల వెంకన్నతో కొందరు రాజకీయాలు చేస్తున్నారని.. అలాంటివి మానుకోవాలని సుబ్బారెడ్డి హితవు పలికారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పనంగా భూములు ఇచ్చారని వైవీ గుర్తుచేశారు. రాజకీయ వ్యతిరేకతతోనే తమపై నిందలు వేస్తున్నారని.. తాము కేవలం శ్రీవారి సేవకులం మాత్రమేనని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సదావర్తి భూములను కాపాడింది తామేనని వైవీ అన్నారు.స్వామి వారికి భక్తులు సమర్పించే ప్రతి పైసా కాపాడుతున్నామని.. తిరుమల కొండకు తాము సేవకులుగానే వెళ్లామని ఆయన స్పష్టం చేశారు. పదవి ఉన్న లేకపోయినా శ్రీవారి ఆస్తులను కాపాడుతామన్నారు.

గతంలో ఏకంగా 50 ఆస్తుల్ని అమ్మాలని చదలవాడ నిర్ణయించారని.. నిరర్థక ఆస్తుల్ని అమ్మాలని జనవరి 30, 2016న తీర్మానం చేశారని సుబ్బారెడ్డి గుర్తుచేశారు. బోర్డు ఛైర్మన్‌ బాధ్యతలు  స్వీకరించిన తర్వాత దీనిపై తాము సమీక్ష కూడా నిర్వహించామని వైవి తెలిపారు.

1974-2014 మధ్య గత ప్రభుత్వాలు టీటీడీ భూములు అమ్మాయన్నారు. భూముల వేలానికి సంబంధించి రెండు బృందాల్ని ఏర్పాటు చేశామని... వేలం వేయాలంటే ఏం చేయాలి..?, ఎలా ముందుకెళ్లాలి..? అనేది చెప్పమని అడిగామన్నారు. శ్రీవారి భూముల వేలంపై ధార్మిక పెద్దల్ని, నిపుణుల్ని సలహా కోరతామని వైవీ తెలిపారు.  

Follow Us:
Download App:
  • android
  • ios