వైఎస్ జగన్ పాలనలో ఒక్క కోర్టులు మాత్రమే కళకళలాడుతున్నాయని వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అరాచకాలు పెరుగుతూ వుంటే జనం కోర్టులు, లాయర్ల చుట్టూనే తిరుగుతారని ఆయన వ్యాఖ్యానించారు. 

వైఎస్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శనివారం మంగళగిరిలో జరిగిన టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. టీడీపీలో అప్పట్లోనే 47 మంది లాయర్లు వుండేవారని చంద్రబాబు గుర్తుచేశారు. యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు, బాలయోగి, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వంటి వారిని అప్పట్లోనే ఎంపిక చేశామని ఆయన తెలిపారు . నిన్న మొన్నటి వరకు టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభ సభ్యుడిగా వున్న సంగతిని చంద్రబాబు వివరించారు. 

తాను 1978లో తొలిసారి ఎమ్మెల్యేను అయిన నాటి నుంచి ఈ 45 ఏళ్లలో ఎందరో ముఖ్యమంత్రులను చూశానని.. కానీ ఇలాంటి పరిస్థితులను చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారం, ప్రతిపక్షం రెండింటిని చూసిందని ఆయన గుర్తుచేశారు. కానీ ఇంత నీచమైన రాజకీయాలను తాను చూడలేదని .. వైసీపీ ప్రభుత్వం అందరూ దివాళా తీశారని, కోర్టులు మాత్రం కళకళలాడుతున్నాయని చంద్రబాబు సెటైర్లు వేశారు. అరాచకాలు పెరుగుతూ వుంటే జనం కోర్టులు, లాయర్ల చుట్టూనే తిరుగుతారని టీడీపీ చీఫ్ దుయ్యబట్టారు. కొద్దిరోజులైతే లాయర్లకు డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్ధితి వస్తుందని చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. 

ఇదిలావుండగా.. వచ్చే ఏడాది మే నెలలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ నాయకుడు నారా లోకేష్ రాష్ట్ర‌వ్యాప్త పాదయాత్ర యువ‌గ‌ళం 33వ రోజుకు చేరుకుంది. ఈ క్ర‌మంలోనే పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పాపాలన్నీంటిని ప్రక్షాళన చేస్తామ‌ని అన్నారు. పసుపు జెండాతోనే వారి జీవితాల్లో మార్పు సాధ్యమనీ, రాష్ట్ర ప్రజలు పసుపు జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అధికార వైసీపీ నేతల దౌర్జన్యాలకు చరమగీతం పాడే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. తమపై పెట్టిన తప్పుడు కేసులకు భయపడొద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు. తనపై ఇప్పటి వరకు దాదాపు 20 కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు.

Also REad: 2024లో టీడీపీ ప్ర‌భుత్వ‌మే.. కేసుల‌కు భ‌య‌ప‌డేది లేదు.. : నారా లోకేష్

ఇలాంటి తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వారిని టీడీపీ అధికారంలోకి రాగానే సన్మానిస్తామనీ, అలాంటి కేసులన్నీ ఎత్తివేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రకు సహకరిస్తే పాదయాత్ర అవుతుందని, లేదంటే దండయాత్ర అవుతుందని ఆయన స్పష్టం చేశారు. జగన్ ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ కు, స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ఇంటికే పరిమితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన లోకేష్ గత 30 ఏళ్లలో ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. పుంగనూరులో టీడీపీ జెండా ఎగురవేస్తే అభివృద్ధి అంటే ఏమిటో మీరే స్వయంగా చూస్తారని ప్ర‌జ‌ల‌కు సూచించారు. నెట్టిగుంటపల్లి రిజర్వాయర్ వల్ల 100 మందికి పైగా రైతులు భూములు కోల్పోయారనీ, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి సరైన పరిహారం అందుతుందన్నారు. భయం తన డిక్షనరీలో లేదని పునరుద్ఘాటించిన ఆయన ఈ దుర్మార్గపు పాలనకు పోలీసు శాఖతో సహా అన్ని వర్గాలు బాధితులేనని అన్నారు.