Chittoor: 2024లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వమే ఏర్పాటవుతుందనీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారనీ, తనపై పెట్టిన తప్పుడు కేసులకు భయపడేది లేదని నారా లోకేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులపై పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని హితవుపలికారు.
TDP national general secretary Nara Lokesh: వచ్చే ఏడాది మే నెలలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ నాయకుడు నారా లోకేష్ రాష్ట్రవ్యాప్త పాదయాత్ర యువగళం 33వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలోనే పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పాపాలన్నీంటిని ప్రక్షాళన చేస్తామని అన్నారు. పసుపు జెండాతోనే వారి జీవితాల్లో మార్పు సాధ్యమనీ, రాష్ట్ర ప్రజలు పసుపు జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అధికార వైసీపీ నేతల దౌర్జన్యాలకు చరమగీతం పాడే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. తమపై పెట్టిన తప్పుడు కేసులకు భయపడొద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు. తనపై ఇప్పటి వరకు దాదాపు 20 కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు.
ఇలాంటి తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వారిని టీడీపీ అధికారంలోకి రాగానే సన్మానిస్తామనీ, అలాంటి కేసులన్నీ ఎత్తివేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రకు సహకరిస్తే పాదయాత్ర అవుతుందని, లేదంటే దండయాత్ర అవుతుందని ఆయన స్పష్టం చేశారు. జగన్ ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ కు, స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ఇంటికే పరిమితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన లోకేష్ గత 30 ఏళ్లలో ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. పుంగనూరులో టీడీపీ జెండా ఎగురవేస్తే అభివృద్ధి అంటే ఏమిటో మీరే స్వయంగా చూస్తారని ప్రజలకు సూచించారు. నెట్టిగుంటపల్లి రిజర్వాయర్ వల్ల 100 మందికి పైగా రైతులు భూములు కోల్పోయారనీ, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి సరైన పరిహారం అందుతుందన్నారు. భయం తన డిక్షనరీలో లేదని పునరుద్ఘాటించిన ఆయన ఈ దుర్మార్గపు పాలనకు పోలీసు శాఖతో సహా అన్ని వర్గాలు బాధితులేనని అన్నారు.
కాగా, పుంగనూరు నియోజకవర్గంలోని కొమ్మిరెడ్డివారి పల్లె నుంచి నారా లోకేష్ 33వ రోజు యువగళం పాదయాత్రను ప్రారంభించారు. పోశంవారిపల్లి వద్ద మహిళలు రోడ్లవెంట నిలబడి ఆయనకు ఘనస్వాగతం పలికారు. కొత్తపేటలో భారీ గజమాలతో యువనేతను స్వాగతించారు. ఇప్పటి వరకు లోకేష్ యువగళం పాదయాత్రలో 437 కిలో మీటర్ల దూరం నడిచారని టీడీపీ వర్గాలు తెలిపాయి. తన పాద్రయాత్రలో కొనసాగుతున్న క్రమంలో పులిచర్ల వద్ద ఎస్సీ, ఎస్టీ ఇన్నోవా కార్ల లబ్ధిదారుల సంఘం ప్రతినిధులు లోకేష్ ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ శాఖలకు అవసరమైన వాహనాలను ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల నుంచే అద్దెకు పెట్టేలా చూస్తామని లోకేష్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.
