మంగళవారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ..  కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండటం, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం రాజకీయ పార్టీల బాధ్యతగా పేర్కొన్నారు. కరోనా మృతుల అంత్యక్రియల్లో మార్గదర్శకాలు పాటించక పోవడం బాధాకరమని ప్రతిపక్షనేత ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా యాక్టివ్ కేసులలో మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ 2స్థానంలో ఉందని, రోజువారీ మరణాల్లో 4వ స్థానంలో ఉందని చంద్రబాబు తెలిపారు. మద్యం దుకాణాలు తెరవడం రాష్ట్రంలో వైరస్ విజృంభణకు మరో కారణమని ఆయన ఆరోపించారు.

Also Read:మేం అలా చేయడం లేదు: చంద్రబాబుకు వైఎస్ జగన్ కౌంటర్

ఒక్కో వ్యక్తికి 3మాస్క్ లు ఇస్తామన్న జగన్ వాగ్దానం ప్రభుత్వంలో ఉండి కూడా నెరవేర్చలేదని, ప్రతిపక్షంలో వున్న తాము రెండున్నర లక్షల మాస్క్‌లు ఇచ్చిన విషయాన్ని బాబు గుర్తుచేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాస్త మారి మాస్క్ ధరిస్తుంటే, ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డిలో మాత్రం మార్పులేదని ఆయన ఎద్దేవా చేశారు.

గత 14నెలల్లో 13జిల్లాలలో దళితులపై 100చోట్ల దాడులు, దౌర్జన్యాలు జరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన ‘‘నిర్భయ’’ చట్టం కన్నా పటిష్టమైన చట్టం ‘‘దిశ’’ తెచ్చామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం రాజమహేంద్రవరం దళిత మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్ విషయంలో ఏం చేసిందని ప్రతిపక్షనేత నిలదీశారు.

Also Read:ప్రత్యర్థులకు స్నేహ హస్తం: బెడిసికొట్టిన బాబు వ్యూహాం, సైకిల్ దిగిన నేతలు

నిందితులపై అటు నిర్భయ చట్టం, ఇటు దిశా చట్టం కేసులు నమోదు చేయకపోవడాన్ని చంద్రబాబు  ఖండించారు. బాధిత దళిత కుటుంబాలను టిడిపి నిజ నిర్ధారణ కమిటీ ప్రతినిధులు పరామర్శించి వారికి రూ.2 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.