అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయని భయపడి పరీక్షలు తగ్గించి నివేదికలు చూపిస్తారని, మన రాష్ట్రంలో అలా చేయడం లేదని ఆయన అన్నారు.

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన మంగళవారంనాడు స్పందన కార్యక్రమం నిర్వహించారు. కరోనా వైరస్ గురించి, జిల్లాల్లో పరిస్థితిపై ఆయన మాట్లాడారు. చనిపోయినవారిలో కొన్ని గంటల తర్వాత కరోనా వైరస్ ఉండదని జగన్ చెప్పారు. 90 శాతం పరీక్షలు కరోనా క్లస్టర్లలో చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కరోనా వైరస్ కేసులు పెరగడంపై చంద్రబాబు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ విమర్శలను తిప్పికొట్టే ఉద్దేశంతోనే జగన్ ఆ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. దేశంలో రోజుకు 50 వేల కోవిడ్ టెస్టులు చేస్తున్న రాష్ట్రం మనదేనని ఆయన అన్నారు. కరోనా వైరస్ రోగులకు వైద్యాన్ని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. 

కరోనాపై ఎవరికీ భయాందోళనలు అవసరం లేదని ఆయన చెప్పారు. అది వస్తుంది, పోతుందని చెప్పారు. వాక్సిన్ వచ్చేంత వరకు దానితో జీవించాల్సి ఉందని ఆయన చెప్పారు. వాక్సిన్ ఎదురు చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి ఒక్క అధికారి సీరియస్ గా పనిచేస్తున్నాడని ఆయన అన్నారు.. 

ఏపీలో కరోనా వైరస్ కేసులు లక్ష మార్కు దాటిన విషయం తెలిసిందే. కరోనా మృతుల సంఖ్య కూడా వేయి దాటింది.