మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిని తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఖండించారు.

ప్రాథమిక విచారణ లేకుండా కొల్లును ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. రవీంద్రను అరెస్ట్ చేయడం కక్ష సాధింపునకు నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు. కావాలనే ఈ కేసులో కొల్లును ఇరికించారని.. ఎమర్జెన్సీలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదన్నారు.

కాగా, తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద జాతీయ రహదారి పై రవీంద్ర ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ వైపు వెళ్తున్నట్లు తెలుసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు మప్టీ లో వెళ్లి అరెస్ట్ చేశారు.కొల్లు రవీంద్ర ప్రయాణిస్తున్న కారును ఆపి అదుపులోకి తీసుకున్న పోలీసులు తుని నుండి విజయవాడ కు తరలించారు.   

Also Read:బ్రేకింగ్... మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

మంత్రి పేర్ని నాని అనుచరుడు, మచిలీపట్నం వైసిపి నేత మోకా భాస్కరరావు హత్య కేసులో టిడిపి నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రమేయం వున్నట్లు ప్రదాన నిందితులు తెలిపారని డిఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు.

ఆయన ప్రోద్భలంతోనే ఈ  హత్య చేసినట్లు ప్రధాన నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు డిఎస్పీ వెల్లడించారు. నిందితులిచ్చిన వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర పై 302,109 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారని... ఆయన లేకపోవడంతో వెనుతిరిగినట్లు తెలిపారు.