Asianet News TeluguAsianet News Telugu

కియో కోసం ఎంతో కష్టపడ్డా.. షిఫ్టింగ్ వార్త బాధ కలిగించింది: చంద్రబాబు

కియా తరలింపును తమిళనాడు ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులు ధ్రువీకరించారని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కంపెనీ పక్క రాష్ట్రానికి తరలిపోవడం దారుణమన్నారు. 

tdp chief chandrababu naidu reacts kia motors shifting to tamilnadu
Author
Amaravathi, First Published Feb 6, 2020, 5:05 PM IST

కియా తరలింపును తమిళనాడు ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులు ధ్రువీకరించారని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కంపెనీ పక్క రాష్ట్రానికి తరలిపోవడం దారుణమన్నారు.

కియో మోటార్స్ కోసం అప్పట్లో తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర పోటీ పడ్డాయని.. కానీ వాళ్లు ఏపీవైపే మొగ్గుచూపారని గుర్తుచేశారు. రూ. 13,500 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిందని దానితో పాటు అనేక అనుబంధ పరిశ్రమలు సైతం వచ్చాయన్నారు.

Also Read:రద్ధులు, కూల్చివేతలు, తరలింపులకు ఫలితం ఇదే: కియా తరలిపోవడంపై పవన్ వ్యాఖ్యలు

కియా ప్లాంట్‌ను గుజరాత్‌లోనే పెట్టాల్సిందిగా స్వయంగా ప్రధాని కార్యాలయం నుంచి యాజమాన్యంపై ఒత్తిడి వచ్చిందని చంద్రబాబు గుర్తుచేశారు. ఎంవోయూ అయిన దగ్గరి నుంచి తాను వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించానని స్వయంగా కియా మోటార్స్ సీఈవో కృతజ్ఞతలు తెలిపారన్నారు.

అలాగే సీఎం నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు సహకరించడం వల్లే ప్లాంట్ వేగంగా నెలకొల్పామని కియా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ కూడా చెప్పారని బాబు గుర్తుచేశారు. భారత్‌లో అత్యంత పాపులారిటీ కలిగిన ఐదో బ్రాండ్ కియా మాటార్స్ అని.. అంతేకాకుండా మూడు లక్షల యూనిట్లను తయారు చేయాలని కియా లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

అనంతపురంలో కియా ప్లాంట్ వల్ల దాదాపు 12 వేల మందికి ఉపాధి దొరికిందని చంద్రబాబు తెలిపారు. కియా ఏపీలో పెట్టడానికి ముందు శ్రీ సిటీ ఎస్ఈజెడ్ చూశారని, దాని తర్వాత అనంతపురం వచ్చారని.. అయితే ఇక్కడ నీళ్లు లేవని సమస్యలు చెప్పారని గుర్తుచేశారు.

Also Read:కియాపై తప్పుడు ప్రచారం, చర్యలు తప్పవు:బుగ్గన

నీళ్లు తీసుకొస్తే మీరు వస్తారా అని నాలుగు నెలలు సమయం అడిగామని.. దీనిలో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీరు ఇచ్చామన్నారు. అక్కడ భూమి ఎగుడు, దిగుడుగా ఉందంటే మళ్లీ ఎల్ అండ్ టీకి పనులు ఇచ్చి రెండు నెలల సరిచేసి ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆటోమొబైల్ ఎకో సిస్టమ్ లేదని.. ఒకప్పుడు వోక్స్ వ్యాగన్ వస్తే అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ అవినీతికి పాల్పడటంతో ఏపీ నుంచి పుణేకు వెళ్లిపోయిందని బాబు గుర్తుచేశారు. 

వైసీపీ ప్రభుత్వం పిచ్చి తుగ్లక్ చర్యలకు పాల్పడుతోందన్నారు టీడీపీ అధినేత. పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకు రావాలంటే చాలా కష్టమని.. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పరిస్థితులు బాగలేదని, పెట్టుబడులు పెట్టే పరిస్ధితి లేదని కథనాలు రాసాయన్నారు. రాష్ట్రం నుంచి లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులు వెళ్లిపోయాయని చంద్రబాబు గుర్తుచేశారు.

Also Read:బెంబేలెత్తుతున్నారు: కియా తరలింపు వార్తలపై చంద్రబాబు వ్యాఖ్య

130 సంస్థలు అమరావతిలో పెట్టాలని ఒప్పందం చేసుకున్నాయని, అవి కూడా వెళ్లిపోయాయన్నారు. 9 నెలల్లో ఒక్క పరిశ్రమ వచ్చిందా..?, రాష్ట్రంలో యువత, ఉద్యోగాల పరిస్థితి ఏంటని చంద్రబాబు నిలదీశారు. విశాఖ లో మిలీనియం టవర్స్ పనిలేక కట్టలేదని, టెక్నాలజీ హబ్ గా చేయాలని ఏర్పాటు చేసామని ప్రతిపక్షనేత గుర్తుచేశారు.

మిలీనియం టవర్స్ లో సెక్రటేరియట్ పెట్టుకుంటామని అంటారా అని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మీడియాలో కథనాలు వస్తే వాళ్లపై దాడి చేస్తున్నారని, చేతకాని రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios