అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ వేరే రాష్ట్రానికి తరలిపోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఉపాధి అవకాశాలు పెంచి వలసలు అరికట్టాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతలను వదిలేసి రద్ధులు, కూల్చివేతలు, తరలింపులు అంటోందని ఆయన దుయ్యబట్టారు.

నిర్మాణాత్మక ఆలోచనలు, ప్రణాళికలు లేని పాలక పక్షాన్ని చూసే పారిశ్రామిక సంస్థలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి అని ప్రభుత్వం గ్రహించాలని పవన్ కల్యాణ్ హితవు పలికారు. పరిశ్రమలు తరలిపోతుంటే ఉపాధి అవకాశాలు ఎలా మెరుగుపరుస్తారు అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

Also Read:కియాపై తప్పుడు ప్రచారం, చర్యలు తప్పవు:బుగ్గన

రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు సానుకూల పరిస్థితులు నెలకొల్పాల్సిన ప్రభుత్వం ఆ  బాధ్యతను విస్మరిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.  కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ సంస్థలు రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోతున్నాయిని.. ఉన్న సంస్థలే వెళ్లిపోతుంటే ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగవుతాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఉన్న కియా పరిశ్రమలోని యూనిట్లు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయి అని వస్తున్న వార్తలు విస్మయాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ వార్తను ప్రపంచానికి తెలియచేసింది ఏదో ఆషామాషీ సంస్థ కాదని.. రాయిటర్స్' అనే ప్రఖ్యాత వార్తా సంస్ధ వెల్లడించిందని జనసేనాని గుర్తుచేశారు.

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఇక్కడ బహుముఖంగా తన ప్లాంట్ విస్తరిస్తుంది అనుకొంటే ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లేందుకు సిద్దపడటం రాష్ట్ర ప్రభుత్వ విధాన లోపాలను తెలియచేస్తోందని పవన్ విమర్శించారు.

విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ నుంచి సాఫ్ట్ వేర్ సంస్థలను ఖాళీ చేయించడం ఆ రంగం ఇకపై ఆంధ్ర ప్రదేశ్ వైపు చూడకుండా చేయడమే అవుతుందన్నారు. ఒక సంస్ధ నూతనంగా పెట్టుబడి పెట్టి కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు కోట్ల రూపాయల వ్యయం అవుతుందని పవన్ గుర్తుచేశారు.

Also Read:బెంబేలెత్తుతున్నారు: కియా తరలింపు వార్తలపై చంద్రబాబు వ్యాఖ్య

ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న రంగాలను ప్రోత్సహించకపోగా  నిరుత్సాహకర పరిస్థితులు సృష్టిస్తే ఆర్ధికాభివృద్ధి ఏ విధంగా సాధ్యం అవుతుందని జనసేనాని నిలదీశారు.

ప్రకాశం జిల్లాలో రూ.24 వేల కోట్ల పెట్టుబడితో కాగితం పరిశ్రమ స్థాపిస్తామని ఒప్పందం చేసుకున్న ఏషియన్ పేపర్స్ అండ్ పల్ప్ పరిశ్రమ మహారాష్ట్రకు వెళ్ళిపోయిన సంగతిని ఆయన గుర్తుచేశారు. ఇలా రాష్ట్రానికి రావాల్సినవి, ఇప్పటికే ఉన్నవీ తరలిపోతుంటే ఏ విధంగా ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.