అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా నుంచి కియా మోటార్స్ ప్లాంట్ తరలింపు వార్తలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. గురువారంనాడు ఆయన టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఏపీని వైసీపీ ప్రభుత్వం అట్టడుగుకు దిగజార్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని, పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, తాజాగా కియా మోటార్స్ ప్లాంట్ కూడా తమిళనాడుకు తరలిపోతోందని ఆయన అన్నారు. వైసీపీ చేస్తున్న దాడులు, దౌర్జన్యాలతో బెంబేలెత్తిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: లోకసభలో కియా మోటార్స్ ఇష్యూ: రామ్మోహన్ నాయుడ్ని అడ్డుకున్న గోరంట్ల మాధవ్

ఏపీలో పనిచేయాలంటే అధికారులు కూడా భయాందోళనలకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఒక మహిళాధికారిపై ఫైళ్లు విసిరేశారని, కొట్టి మరో అధికారిపై దౌర్జన్యం చేశారని ఆయన ఆరోపించారు. జై అమరావతి అన్నందుకు నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారని ఆయన అన్నారు 

వైసీపీ చేతగానితనం వల్లనే రాష్ట్ర రాబడి పడిపోయిందని ఆయన అన్నారు. ప్రజలపై రూ.700 కోట్ల భారం మోపారని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో నెలకొల్పిన ప్లాంట్ ను కియా మోటార్స్ తమిళనాడుకు తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటోందని రాయిటర్స్ లో ఓ వార్తాకథనం వచ్చిన విషయం తెలిసిందే. దానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేగుతోంది.

Also Read: ఏపీ నుంచి కియా మోటార్స్ తరలింపు వార్తలపై గల్లా జయదేవ్ ట్వీట్