రాష్ట్ర రాజధానిగా అమరావతి అన్ని విధాలా అనుకూలమన్నారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతికి నాడు అసెంబ్లీలో జగన్ మద్ధతు తెలిపారని బాబు గుర్తుచేశారు.

అమరావతి నిర్మాణానికి కేంద్రం కూడా సహకారం అందించిందని.. ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:రాష్ట్రంలో రెడ్దిజం: మహేష్ "హే మళ్ళీ ఏసేశాడు" డైలాగ్ తో రఘురామ ఫైర్

అమరావతిలో భూ సమీకరణ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని.. భూములు ఇచ్చిన రాజధాని రైతులకు ప్లాట్లు అందజేశామని ఆయన గుర్తుచేశారు. రాజధాని రైతులకు పదేళ్ల పాటు ఆర్ధిక సాయం అందేలా చర్యలు తీసుకున్నామని... 2022 నాటికి అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మించాలని భావించామన్నారు.

అమరావతిలో తొలి దశలో 62 ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టామని.. పనులన్నీ పూర్తి చేసి వుంటే అమరావతి రూపు రేఖలు మారిపోయేవని చంద్రబాబు అన్నారు.

అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని.. రైతులు, వివిధ సంస్థలకు భూములు ఇవ్వగా 3 వేల ఎకరాలకు పైగా భూములు ఉంటాయని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఈ భూములు అమ్ముకుంటే... ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల వరకు ఆదాయం వస్తుందని చంద్రబాబు వెల్లడించారు.

Also Read:అసంపూర్తే: రాష్ట్ర విభజనపై జగన్ సర్కార్ సంచలన వాదన

అమరావతి నిర్మాణానికి అన్ని పుణ్యక్షేత్రాల నుంచి జలం, మట్టి తీసుకొచ్చి శంకుస్థాపన చేశామని, రాజధానిగా అమరావతే ఉండాలని 50 శాతం కంటే ఎక్కువమంది ప్రజలు కోరుకుంటున్నారని బాబు వెల్లడించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లేందుకు అమరావతి అనుకూలమైన ప్రాంతమని చంద్రబాబు చెప్పారు.