ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ కి కొరకరాని కొయ్యగా మారిన సొంతపార్టీనేత రఘురామకృష్ణం రాజు..... వైసీపీ పై తన మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా కులం పేరు చెబుతూ, మధ్యలో సినిమా డైలాగ్స్ వాడుతూ ఆయన తనదైన శైలిలో జగన్ పై విరుచుకుపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ లో రెడ్ టేపిజం లేదు కానీ రెడ్దిజం ఉందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని పదవులన్నీ కూడా తన సొంతకులానికే కట్టబెడుతున్నాడని దుయ్యబట్టారు. దూకుడు సినిమాలో మహేష్ బాబు "హే మళ్ళీ ఏసేశాడు" అన్నట్టుగా జగన్ మళ్ళీ రెడ్లకు పదవి కట్టబెట్టేసాడు అని అనుకుంటున్నారని రఘురామ సెటైర్లు వేశారు. 

మచ్చుకకు చదువుతాను అంటూ రాష్ట్రంలో విప్ లుగా ఉన్నవారేరి పేర్లు చదువుతూ... గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, కాపు రామచంద్రా రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఒకే కులానికి ఇన్ని విప్ లా అంటూ ఆయన ధ్వజమెత్తారు. దానితోపాటుగా సీఎం కార్యాలయంలో సలహాదారుల పేర్లను కల్లాం అజేయ రెడ్డి, ధనుంజయ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి అంటూ చదువుకొచ్చారు. 

ఇక ఆ తరువాత టీటీడీ బోర్డును చూపిస్తూ... చైర్మన్ గా సుబ్బా రెడ్డి, సభ్యులుగా పుట్టా ప్రతాప్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి..... ఇలా వరుసగా కమిటీలను కూడా చదివాడు. రాష్ట్రంలో వేరే కులమే లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. 

రెండు పోస్టులు ఉంటె ప్రధానమైనది రెడ్డికి, ప్యూన్ లాంటిది బీసీకి ఇస్తున్నారని అన్నారు. హిందూ మతంలో కులాలుంటాయి కానీ.... కులాలు లేని క్రైస్తవ మతంలో ఉంది కూడా చివరనున్న రెండక్షరాలకే జగన్ ప్రాధాన్యతనిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

గతంలో వైసీపీ సోషల్ మీడియా కోరోధినాటర్ గా ఉన్న దేవేందర్ రెడ్డి ఇప్పుడు జగన్ సర్కారులో డిజిటల్ మీడియా పదవిని ఇచ్చారని, అటువంటి వ్యక్తి తనపైన, తన విగ్గుపైనా జోకులు వేసే దమ్ము ధైర్యం ఎక్కడినుండి వచ్చాయని, అతడిపై చర్యలు తీసుకోకపోతే పార్లమెంటులో, లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. 48 గంటల డెడ్ లైన్ కూడా విధించారు. 

తనకు రెడ్డి అంటే ఎంతో ప్రేమ అని, కానీ కొందరి పిచ్చివాళ్ల వల్ల ఆ కులం, సర్కారు కూడా అప్రతిష్ఠని మూటగట్టుకోవాల్సి వస్తుందని అన్నారు. తనకు ప్రేమ ఉండబట్టే తన మనవడికి రాజశేఖర్ రెడ్డి అని పేరు పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చాడు రఘురామ.