3 రాజధానుల వ్యవహారంలో ప్రభుత్వంపై అమరావతి ప్రాంత ప్రజలు నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్‌పై మండిపడ్డారు.

శుక్రవారం అనంతపురంలో మాట్లాడిన ఆయన బంగారు బాతులాంటి అమరావతిని వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. రాజధాని విషయంలో జగన్ యూటర్న్ తీసుకున్నారని.. అమరావతి విషయంలో అవినీతి ఉంటే నిరూపించాలని చంద్రబాబు సవాల్ విసిరారు.

Also Read:వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్: చంద్రబాబుకు 'ప్రాంతీయ' చిక్కులు

భూములిచ్చిన రైతులను అపహాస్యం చేస్తున్నారని, రాజధానిపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఉపాధి కల్పన కేంద్రంగా అమరావతి ఉంటుందనే రైతులు ముందుకు వచ్చారని.. అలాంటి రైతులను హేళన చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

రాజకీయాల్లో వ్యక్తిగత ప్రయోజనాలు కాదు.. ప్రజా ప్రయోజనాలు ముఖ్యమని ఆయన సూచించారు. అభివృద్ధి అనేది అధికార వికేంద్రీకరణతో సాధ్యం కాదని.. అభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యమవుతుందని వెల్లడించారు.

Also Read:జీఎన్ రావు కమిటీ సీఎంతో భేటీ: రాజధానిపై కీలక ప్రకటన చేసే ఛాన్స్

మనది భాషా ప్రయుక్త రాష్ట్రమని.. ఆంగ్లం, తెలుగు మాధ్యమం రెండూ ఉండాలని కోరుతున్నామని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నీరుగారిపోయే పరిస్ధితి ఏర్పడిందని చంద్రబాబు ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ విశ్వసనీయత శాశ్వతంగా ఉండాలని.. ఎస్సీలకు అన్యాయం జరిగినట్లు భావిస్తే అందరికీ సమన్యాయం చేయాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు.