ఈ నెల 19 నుంచి ప్రజా చైతన్య యాత్ర చేపడుతున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఒంగోలు నుంచి ఈ యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ నూతన చట్టాలను రూపొందిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో వైసీపీ ఎలాంటి అభివృద్ధిని చేయలేదని విమర్శించారు. సుమారు 200 మంది పోలీసులకు జీతాలు ఇవ్వడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read:బస్సు యాత్రకు సిద్ధమైన చంద్రబాబు: స్థానిక ఎన్నికలే టార్గెట్

మొత్తం 45 రోజుల పాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల నేతృత్వంలో ఈ యాత్ర నిర్వహించనున్నారు. 13 జిల్లాలు, 100కు పైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా .. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ యాత్ర పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం ఆయన మాట్లాడుతూ.. అమరావతి కోసం పోరాడి టీడీపీ ఎమ్మెల్సీలు పోరాడి ప్రజల్లో వారి గౌరవం పెంచుకున్నారని చంద్రబాబు కొనియాడారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. తెలుగుదేశం హయాంలో కట్టిన భవనాల్లోనే దిశ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారని చంద్రబాబు గుర్తుచేశారు.

కేంద్రం వద్ద దిశ చట్టం పెండింగ్ లో ఉండగానే దిశ స్టేషన్ ప్రారంభించారని ఆయన మండిపడ్డారు. తనపై పోస్టులు పెట్టినవాళ్లపై దిశ చట్టం కింద కేసు పెట్టమని టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అడిగితే ఏదేదో మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:చర్యలు తప్పవు: ఏపీ శాసమండలి సెక్రటరీకి ఛైర్మెన్ షరీఫ్ వార్నింగ్

అసెంబ్లీలో ఉన్నదానిపై కేసు ఎలా పెడ్తామని ఏఎస్‌పి అనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చట్టమే లేకుండా పోలీస్ స్టేషన్ ఎలా ప్రారంభిస్తారని ముఖ్యమంత్రికి చెప్పలేని నిస్సహాయులు వీళ్లు రూల్స్ చెబుతారా అని ప్రతిపక్షనేత చురకలంటించారు.