రాష్ట్రం కోసం చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మార్చారంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. డిజిటల్ మహానాడులో భాగంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. సంపద సృష్టించడం నాశనం చేయడమంత ఈజీకాదని గుర్తుచేశారు. విశ్వాసం, నమ్మకం కల్పించినపుడే పరిశ్రమలు వస్తాయని చంద్రబాబు అన్నారు. ప్రజావేదికతో ప్రారంభమైన విధ్వంసం నిరంతరం కొనసాగిందని ఆయన ఎద్దేవా చేశారు.

అమరావతిని కొనసాగిస్తే 2.50 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేవని టీడీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరంకుశ, అప్రజాస్వామిక విధానాలను అమలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి కంపెనీలు కూడా ముందుకు రావడం లేదని... ఏపీ ప్రభుత్వ చర్యలు యువత భవిష్యత్ కు శాపంగా మారాయని ఆయన మండిపడ్డారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేశారని.. టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానం తెచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు.

Also Read:చంద్రబాబు తలుచుకుంటే మీరేమయ్యేవారు..?: జగన్ పై రామ్మోహన్ నాయుడు ఆగ్రహం

రెండేళ్లలో విదేశీ పెట్టుబడుల్లో 20వస్థానానికి దిగజార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్, యువత కోసం రేయింబవళ్లు ఫైళ్లు పట్టుకొని తిరిగామని.. ఇప్పుడు విధ్వంసం చేసే పరిస్థితికి తెచ్చారని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను నాశనం చేశారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక ఫలితాలు రావడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. నేడు రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి పూనుకున్నారని..  ప్రజలు చైతన్యవంతులై బుద్దిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చంద్రబాబు పిలుపునిచ్చారు.