ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది టిడిపి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. సీఎం జగన్ రెడ్డి చేతకానితనంతో రాష్ట్రం రావణకాష్టం అవుతోందన్నారు. దేశంలోనే కరోనా కేసుల విషయంలో ఏపీ టాప్ లో ఉందన్నారు. పాజిటివ్ కేసులు, మరణాలు సహా ప్రతీ విషయంలో తప్పుడు లెక్కలు చూపుతున్నారని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. 

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడు2021లో రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ వైఫల్యం కారణంగానే కరోనాతో ఎక్కువ మంది చనిపోయారన్నారు.ఆస్పత్రుల్లో వైద్యం అందించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా? అని నిలదీశారు. ఈ వైసిపి ప్రభుత్వం కరోనాతో బాధపడుతున్నవారికి మందులు, బెడ్లు, ఆక్సిజన్ కూడా అందించలేకపోతోందని రామ్మోహన్ ఆరోపించారు. 

 ''104, 108 నిర్వహణ తీరును కోర్టులు తప్పుబట్టాయి.108 అందుబాటులో లేక మోటార్ బైకులపై తీసుకెళ్లే స్థితికి తీసుకువచ్చారు. ప్రభుత్వం పబ్లిసిటీ కోసం చేసే ఖర్చు పబ్లిక్ కు ఏమాత్రం పనికి రావడం లేదు.మందుల బ్లాక్ మార్కెట్ పెరగడానికి ప్రభుత్వ చేతకాని తనమే కారణం.ఆస్తులు రాయించుకుంటున్న ఆస్ప్రతులపై చర్యలు ఏవి జగన్ రెడ్డీ? బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఏనాడైనా ప్రజలకు భరోసా కల్పించారా?'' అని నిలదీశారు.

''కరోనా తొలి రోజు నుండి కూడా ప్రజల్ని మభ్యబెడుతున్నారు. పారాసిటమాల్, బ్లీచింగ్, సహజీవనం అంటూ ప్రజల్ని బలి చేశారు. కరోనా మృతుల కుటుంబాల కష్టాలు చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి. కరోనాతో ప్రజలు అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం అరెస్టులపై దృష్టి పెట్టారు'' అని మండిపడ్డారు. 

''కేసుల కోసమే ముఖ్యమంత్రి కేంద్రానికి దాసోహమైపోయారు. హుదుద్, తిత్లీ తుపాన్ల సమయంలో చంద్రబాబు కృషి తెలుసుకోండి. క్రైసిస్ వచ్చినపుడు ఎలా ఉండాలో చంద్రబాబును చూడండి. ప్రతిపక్షాలను వేధించాలని చంద్రబాబు అనుకుంటే మీరేమయ్యేవారు.? చంద్రబాబు దూర దృష్టికి నిదర్శనం జీనోమ్ వ్యాలీ అని తెలుసుకోండి'' అని రామ్మోహన్ పేర్కొన్నారు.

read more  రఘురామను ఏడేళ్లు జెల్లోనే వుంచేలా... జగన్ సర్కార్ కుట్రలు..: డిజిటల్ మహానాడులో చంద్రబాబు

''ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కనీస సదుపాయాలు కల్పించకపోవడం దుర్మార్గం కాదా.? మాస్కులు అడిగినందుకు దళిత డాక్టర్ ను వేధించి చంపేశారు. కనీస సదుపాయాలివ్వకుండా  ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్రాణాలను తీస్తున్నారు. రాజకీయం చేస్తున్న వాలంటీర్స్ కు అవార్డులా.? ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు, మెడికల్ సిబ్బందికి వేధింపులా.?'' అంటూ నిలదీశారు.

''పిల్లల ప్రాణాలు కాపాడడం మాని పరీక్షలు పెట్టాలనుకున్నారు. ఈ నిర్ణయంపై టీడీపీ పోరాటం చేస్తే వినకుండా చివరకు కోర్టుతో చెప్పించుకున్నారు. రెండో వేవ్ పై సమాచారం ఉన్నా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయలేకపోయారు. తమిళనాడు, కేరళ సహా అనేక రాష్ట్రాలు రెండో వేవ్ కు ముందే ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టారు'' అని తెలిపారు. 

''జగన్ రెడ్డి మాటలు చెప్పడం తప్ప పని చేయడం చేత కాదు. మే 1 నుండి 18ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ అన్నారు. ఆ విషయంలో కూడా మాట మార్చారు. వ్యాక్సిన్ల వృథాలో కూడా ఏపీ అగ్రస్థానంలో నిలిచింది'' అని ఎంపీ రామ్మోహన్ మండిపడ్డారు.