టిడిపి, భాజపాకు ఓట్లడిగే హక్కు లేదు

టిడిపి, భాజపాకు ఓట్లడిగే హక్కు లేదు

ప్రజా సమస్యలను పరిష్కరించలేని టిడిపి, భారతీయ జనతా పార్టీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదని పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ) సంస్ధను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోంది. అందుకు నిరసనగా వెంకటేశ్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయమై మాట్లాడేందుకు పవన్ బుధవారం విశాఖలో పర్యటించారు. డిసిఐ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, టిడిపి, భాజపా ప్రజాప్రతినిధుల ముందే ప్రైవేటీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నా ఎంపిలు అవంతి శ్రీనివాస్, కంభంపాటి హరిబాబు చూస్తు ఊరుకోవటం దారుణమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని వారికి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని పవన్ తేల్చేశారు.

ఎంపిలు అవంతి, హరిబాబులు బాధ్యతలు మరచి ప్రవర్తిస్తున్నట్లు తాను ప్రవర్తించలేనని స్పష్టం చేసారు. సమస్యలను లేవదీయటానికే, సమస్యలపై పోరాటాలు చేయటానికే తాను జనసేన పార్టీని ఏర్పాటు చేసిన విషయాన్ని పవన్ గుర్తు చేసారు. పోయిన ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల తాను టిడిపి, భాజపాలకు మద్దతు ఇచ్చినట్లు పవన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏదో అద్భుతం జరుగుతుందన్నారు. అయితే, అదేంటో మాత్రం చెప్పలేదు.

సమస్యలను పరిష్కరించలేని టిడిపి, భాజపాలను నిలదీయటానికి తాను ముందుంటానన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే ఎలా అంటూ మిత్రపక్షాల నేతలపై మండిపడ్డారు. తాను టిడిపి, భాజపాల పక్ష కాదని, ప్రజాపక్షమంటూ ప్రకటించారు. దేశానికి బలమైన నేతలు కావాలని, ఏక వ్యక్తి, ఏకపార్టీ వల్ల దేశానికి మంచి జరగదని తన అభిప్రాయమన్నారు. తాను సమస్యల గురించే ప్రస్తావిస్తానని, సమస్యలపై పోరాటం చేస్తానని ప్రభుత్వాలు ఏం పీక్కుంటాయో పీక్కోండంటూ సవాలు విసిరారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయటంలో తాను జైలుకు వెళ్ళటానికి కూడా సిద్ధమన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos