Asianet News TeluguAsianet News Telugu

తిరుమల కొండపై అన్యమత ప్రచారం... టిటిడి నిర్ణయం అందుకోసమే: కళా ఆరోపణ

డిక్లరేషన్ పై  జగన్ కి సంతకం చేయటం ఇష్టం లేదని తిరుమలలో ఎన్నో ఏళ్ల నుంచి ఆచరిస్తున్న విధానాన్ని మారుస్తారా? అని టిటిడి ఛైర్మన్ ను కళా నిలదీశారు.

TDP AP Chief  kala venkat rao fires on YV Subba reddy  akp
Author
Tirumala, First Published Sep 20, 2020, 10:59 AM IST

గుంటూరు: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందూ మత సాంప్రదాయాలను మంట గలుపుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యహరిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. రాష్ట్రంలో రోజుకో దేవాలయంపై దాడులు, విగ్రహాల ధ్వంసం, విగ్రహాల మాయం వంటి ఘటనలు  చోటు చేసుకున్నా ఈ ప్రభుత్వానికి మాత్రం కనీసం చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా టీటీడీ చైర్మనే తిరుపతి లో అన్యమతస్టులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారని... డిక్లరేషన్ పై  జగన్  కి సంతకం చేయటం ఇష్టం లేదని ఎన్నో ఏళ్ల నుంచి ఆచరిస్తున్న విధానాన్ని మారుస్తారా? అని టిటిడి ఛైర్మన్ ను కళా నిలదీశారు.

''వైవి సుబ్బారెడ్డి నిర్ణయం అన్య మతస్థులు ఎవరైనా కొండమీదికి రావచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనట్లుగా ఉంది. ఇది ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలను, స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉంది. ఎపి రెవెన్యూ ఎండోమెంట్స్ -1, జీవో ఎంఎస్ నెంబర్- 311, రూల్ నెం.16 ప్రకారం హిందువులు కానివారు తప్పనిసరిగా దర్శనానికి ముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో తమ డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ పద్ధతి చాలా దశాబ్దాలుగా కొనసాగుతోంది'' అని వివరించారు. 

''ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఎవరైనా పాటించాల్సిందే. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం లాంటి నేతలు సంతకం పెట్టి దర్శనానికి వెళ్లడం జరిగింది. కానీ గతంలో టీటీడీకి ఎవరూ డిక్లరేషన్ ఇచ్చిన సందర్భాలు లేవంటూ వైవీ సుబ్బారెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు? హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా టీటీడీ నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం. మొన్న అన్యమత ప్రచారం, నిన్న నిధుల మల్లింపు, నేడు డిక్లరేషన్ ఎత్తివేయాలని చూస్తున్నారు.దేవాలయం ఆవిర్భావం నుంచి ఉన్న డిక్లరేషన్ ఎత్తేయడం ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకు టీటీడీ ఛైర్మన్ పాకులాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం టీటీడీ నిబంధనలకు పాతరేస్తున్నారు'' అని మండిపడ్డారు. 

read more  డిక్లరేషన్ రగడ: అందుకే జగన్‌కు అక్కర్లేదన్నాను... వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ

''జగన్ గతంలో శ్రీవారి ప్రసాదం కూడా తీసుకోకుండా అవమానించారు. ఇప్పుడు డిక్లరేషన్ ఎత్తేసి తిరుపతి సంప్రదాయాలు మంటగలపుతున్నారు. హిందూ దేయాలయాల పట్ల, సంప్రదాయాల పట్ల లెక్కలేని తనంగా ఉంటూ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి అన్యమత ప్రచారంతో పాటు పథకం ప్రకారం హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వరుస సంఘటనలు జరుగుతున్నాయి'' అని ఆరోపించారు. 

''రాష్ట్రంలో దేవాలయాలపై 80కి పైగా దాడులు, విధ్వంసం జరిగినా చర్యలు తీసుకోలేదు. అంతర్వేదిలో రథం దగ్ధం, దుర్గగుడిలో మూడు వెండి సింహాలు మాయమైనా ఇప్పటివరకు చర్యలు లేవు. తిరుమలలో ఆలయ నిబంధనలు అమలుచేయాల్సిన ఛైర్మనే వాటికే పాతరేయడం గతంలో ఎన్నడూ జరగలేదు. డిక్లరేషన్ ఎత్తేయాలని వైవీ సుబ్బారెడ్డికి జగనే ఆదేశాలు ఇచ్చారనేది వాస్తవం. హిందూ మతంపై జగన్ పూర్తి కసితో ఉన్నారు.అన్యమత ప్రచారంతో పాటు రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు హెచ్చుమీరుతున్నాయి. డిక్లరేషన్ ఎత్తేయడం తిరుమల వెంకన్నను అవమానపరచడమే'' అన్నారు. 

''ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న డిక్లరేషన్ తీసేయడంలో ఉన్న ఆంత్యర్యం ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వెంకటేశ్వర స్వామి నిధుల మీద ఉన్న శ్రద్ధ వెంకన్న స్వామి సంప్రదాయాలను కాపాడటంలో ఎందుకు లేదు?రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ లేదుగానీ రోజుకో జిల్లా చొప్పున దేవాలయాలపై దాడుల వికేంద్రీకరణ పగడ్బందీగా జరుగుతోంది. హిందూ దేవాలయాల మీద దాడులు జరిగే ప్రతి చోటా సీసీ కెమేరాలు పనిచేయకపోవడం కుట్రకోణాన్ని తెలియజేస్తోంది'' అని ఆరోపించారు. 

''మొదట దేవాలయాలంపై దాడి జరిగినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే రోజుకో దేవాలయం ధ్వంసం అయ్యేది కాదు. ప్రభుత్వం హిందూ దేవాలయాల పట్ల, హిందువుల మనోభావాల పట్ల ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తుందో సమాధానం చెప్పాలి. ప్రభుత్వ బాండ్లలో టీటీడీ నిధులు పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. దేవుడి సొమ్మును ప్రభుత్వ బాండ్లలో ఎలా పెడతారో అర్థం కావడంలేదు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా హిందూ మత సంప్రదాయాలను గౌరవించే విధంగా వ్యహరించాలి'' అని కళా వెంకట్రావు సూచించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios