తిరుమలలో అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తాను అనలేదని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికలు తన వ్యాఖ్యలను వక్రీకరించాయని ఆయన ఆరోపించారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోజూ వివిధ మతాలకు చెందిన, వేలాది మంది భ‌క్తులు వ‌స్తారని.. వారంద‌రినీ డిక్ల‌రేష‌న్ త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాల్సిందేన‌ని అడ‌గ‌లేము క‌దా? అని మాత్రమే తాను వ్యాఖ్యానించానని వైవీ స్పష్టం చేశారు.

సోనియా గాంధీ, దివంగ‌త సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌పుడు డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌లేద‌ని మాత్ర‌మే తాను చెప్పాననన్నారు. అందువల్లే ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిక్ల‌రేష‌న్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించినట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

టీటీడీ చ‌ట్టంలోని రూల్ 136 ప్ర‌కారం హిందువులు మాత్ర‌మే ద‌ర్శ‌నానికి అర్హులు. ఇక స్వామివారి ద‌ర్శ‌నం చేసుకోద‌ల‌చిన ఇత‌ర మ‌త‌స్తులు తాము హిందూయేత‌రుల‌మ‌ని దేవ‌స్థానం అధికారుల‌కు చెప్పి త‌మంతట తామే డిక్ల‌రేష‌న్ ఇవ్వాల్సి ఉంటుంద‌ని రూల్ : 137లో స్ప‌ష్టంగా ఉందని సుబ్బారెడ్డి తెలిపారు.

ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న సమయంలో జగన్ తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్న తర్వాతే పాద‌యాత్రను ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. పాదయాత్ర ముగిసిన తర్వాత తిరుప‌తి నుంచి కాలిన‌డ‌క‌న వ‌చ్చి స్వామివారి ద‌ర్శ‌నం చేసుకుని ఇంటికి వెళ్లారని వైవీ తెలిపారు.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత శ్రీవారిని దర్శించుకున్నాకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వెంకటేశ్వర స్వామిపై జగన్‌కు అపారమైన భ‌క్తివిశ్వాసాలు ఉన్నాయ‌న‌డానికి ఇంత‌కంటే ఆధారాలు అవ‌స‌రం లేదని ఆయన అన్నారు. అందువ‌ల్లే జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదని చెప్పాను తప్ప డిక్లరేషనే తీసేయ్యాలని తాను చెప్పలేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.