మొత్తానికి టిడిపి, వైసిపిలు ఏకమయ్యాయి. ఏ విషయంలో అనుకుంటున్నారా? అదేలేండి తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిరసన తెలిపే విషయంలో. రెండు రోజుల నుండి ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా ఆందోళనలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ఇదే విషయమై రాష్ట్ర ప్రజనీకం రెండు పార్టీల మీద మండిపోతున్నారు. సమస్య ఒకటే అయినపుడు వేర్వేరుగా పోరాటం చేస్తే ఉపయోగం ఏమి ఉంటుందని జనాలు పార్టీలను నిలదీస్తున్నారు.

దాంతో బుధవారం ఉదయం నుండి ఇటు రాజ్యసభ అటు లోక్ సభలో ఏకకాలంలో టిడిపి, వైసిపి ఎంపిలు ఆందోళన మొదలుపెట్టారు. పార్టీలకతీతంగా ఈ పనిని రెండు పార్టీలు ఎప్పుడో చేసి ఉండాల్సింది. కాకపోతే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిడిపి ఎంపిలు కూడా వైసిపితో కలిసారు. ఎంపిల ఆందోళనతో ఉభయ సభల్లోనూ సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంత చెప్పినా ఎంపిలు వినలేదు. దాంతో ఎంపిల వైఖరిపై స్పీకర్ పలుమార్లు మండిపడుతున్నారు.

ఇదే విధంగా మంగళవారం సభలో చేసిన ఆందోళనలతో కేంద్రమైతే పెద్దగా లెక్క చేయలేదనే చెప్పాలి. ఆందోళనల కారణంగా ఏదో మొక్కుబడిగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, పియూష్ గోయెల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే, ఆ ప్రకటనలోని డొల్లతనం అందరకీ తెలిసిందే. దాంతో బుధవారం ఉదయం నుండి ఎంపిలు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. దాంతో హోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తదితరులు చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. విచిత్రమేమిటంటే సభలోనే ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడి మాత్రం ఎటువంటి ఫీలింగ్స్ బయటపడకుండా సభలో జరుగుతున్న గందరగోళాన్ని మౌనంగా గమనిస్తున్నారు.