ముగిసిన టీడీఎల్పీ భేటీ: అసెంబ్లీలో తెలుగుదేశం వ్యూహం ఇదే
అమరావతిపై కీలక ప్రకటన, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ భేటీ అయ్యింది.
అమరావతిపై కీలక ప్రకటన, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ భేటీ అయ్యింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నేతలు పాల్గొన్నారు.
అనంతరం సమావేశ వివరాలను టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు మీడియాకు వివరించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నామన్నారు.
అసెంబ్లీలోనూ ఒకే రాజధాని... ఒకే అసెంబ్లీకి అనుకూలంగానే తమ వాదనను వినిపిస్తామని నిమ్మల వెల్లడించారు. కార్యాలయాల తరలింపుతో ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఒరిగేదేమీ ఉండదన్నారు.
Also Read:అసెంబ్లీ కట్టడి, ముట్టడి అంటే వూరుకోం: చంద్రబాబుకు తమ్మినేని వార్నింగ్
విశాఖపట్నం ఇప్పటికే ఆర్ధిక రాజధానిగా మారిందని.. అభివృద్ధిని వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని రామానాయుడు తెలిపారు. అమరావతిలో పోలీసుల తీరు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోందని.. ప్రజాగ్రహం ముందు ప్రభుత్వం ఆటలు సాగవని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రాజధాని మార్పు గురించి చెప్పారా అని నిమ్మల ప్రశ్నించారు. రాజధాని తరలింపుపై రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని, బ్యాలెట్ ద్వారా వారి అభిప్రాయాలను సేకరించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలని రామానాయుడు డిమాండ్ చేశారు.
కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుకు సంబంధించి సోమవారం ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించనున్న నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
రాజధాని కోసం భూములిచ్చిన రైతులను సీఎం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. అమరావతిని ధ్వంసం చేయాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని, ఇది కేవలం రైతులకు మాత్రమే సంబంధించిన అంశం కాదని, రాష్ట్ర ప్రజలందరికీ చెందినదన్నారు.
Also Read:రాయపాటికి వల: సిబిఐ డైరెక్టర్ నాకు సన్నిహితుడు, తనకు జగన్ తెలుసు
అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలంటూ 32 రోజులుగా రైతులు, మహిళలు, యువత రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారని.. ఆడపడుచులపై పోలీసులు దాడులకు పాల్పడుండటం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్‌ను సంతోష పెట్టేందుకు పోలీసులు బలి పశువులు అవుతున్నారని.. అధికారం చేతిలో ఉంటే టీడీపీ కన్నా బాగా పనిచేయాలని సూచించారు. టీడీపీ హయాంలో ఎవరైనా, ఎక్కడైనా స్వేచ్ఛగా సమావేశాలు పెట్టుకునేందుకు అవకాశం కల్పించామని చంద్రబాబు గుర్తుచేశారు.
విశాఖపట్నం, అక్కడి ప్రజలు అంటే తనకు ఇంతో ఇష్టమని... ఇవాళ రైతులను మోసం చేసిన వ్యక్తులు, రేపు విశాఖ ప్రజలకు నమ్మకద్రోహం చేయరని గ్యారెంటీ ఏంటని టీడీపీ చీఫ్ ప్రశ్నించారు.