ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారారం రాజధాని విషయంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలు పకడ్బంధీగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

చట్టసభలను అంతా గౌరవించాలని సూచించిన ఆయన.. చట్టసభలకు సభ్యులను రాకుండా అడ్డుకోవడం చట్టవిరుద్ధమని స్పీకర్ తెలిపారు. సభను సజావుగా జరగకుండా అడ్డుకునే ప్రయత్నం, చట్ట సభలను ముట్టడించే చర్యలు కూడా సభా హక్కులను హరించడమే అవుతుందని తమ్మినేని పేర్కొన్నారు.

Also Read:విజన్- 2020 అంటే రోడ్డుపై భిక్షాటన చేయడమా: బాబుపై తమ్మినేని వ్యాఖ్యలు

చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని.. అదే సమయంలో నిరసన సైతం చట్టాలకు లోబడి ఉండాలని సీతారాం స్పష్టం చేశారు. మేం ముట్టడిస్తాం.. మేం కట్టడి చేస్తాం.. మేం ఎదిరిస్తాం.. మేం దాడి చేస్తాం అంటే అది నేరంగా పరిగణిస్తామన్నారు. కొందరు రాజ్యాంగ వ్యవస్థలకే వార్నింగ్‌లు ఇస్తున్నారని పరోక్షంగా చంద్రబాబుకు చురకలంటించారు. సభ్యులు తమ అభిప్రాయం చెప్పేందుకు హక్కు ఉందన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుకు సంబంధించి సోమవారం ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించనున్న నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

రాజధాని కోసం భూములిచ్చిన రైతులను సీఎం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. అమరావతిని ధ్వంసం చేయాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని, ఇది కేవలం రైతులకు మాత్రమే సంబంధించిన అంశం కాదని, రాష్ట్ర ప్రజలందరికీ చెందినదన్నారు.

Also Read:ఉత్తరాంధ్ర దెబ్బకు చంద్రబాబు విలవిల...ఇది అసలైన...: తమ్మినేని

అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలంటూ 32 రోజులుగా రైతులు, మహిళలు, యువత రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారని.. ఆడపడుచులపై పోలీసులు దాడులకు పాల్పడుండటం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగన్‌ను సంతోష పెట్టేందుకు పోలీసులు బలి పశువులు అవుతున్నారని.. అధికారం చేతిలో ఉంటే టీడీపీ కన్నా బాగా పనిచేయాలని సూచించారు. టీడీపీ హయాంలో ఎవరైనా, ఎక్కడైనా స్వేచ్ఛగా సమావేశాలు పెట్టుకునేందుకు అవకాశం కల్పించామని చంద్రబాబు గుర్తుచేశారు.