అంతా మర్చిపోయిన తరిమెల నాగిరెడ్డి (టిఎన్)ని పవన్ గుర్తు చేయడం విశేషం నాగిరెడ్డి నిలబెట్టిన రాజకీయాలు వేరు, పంథా వేరు టిఎన్ పేరును వాడుకుంటాడా లేక తాను భిన్నమని ప్రకటిస్తాడా  

తరిమెల నాగిరెడ్డి పేరు ఈ తరానికి తెలియదు. భారతకమ్యూనిస్టు పార్టీ చరిత్రలో, అందునా సాయుధ పోరాట రాజకీయాల చరిత్రలో ఆయన పేరు చెరపలేనిది. విప్లవ రాజకీయాల వైపు వెళ్లే ముందు ఆయన చాలా సార్లు శాసన సభ్యుడు, పార్లమెంటు సభ్యుడుగా ఉన్నారు. అసెంబ్లీలు పార్లమెంటులు పేదరిక నిర్మూలనలో పనికిరావని, సాయుధ పోరాట పంథాయో సరైన మార్గమని ఎంచకుని ఆ మార్గంలో ఆయన చాలా దూరం వెళ్లారు. యుసిసిఆర్ఐ (ఎం ఎల్) అనే పార్టీకి నాయకత్వం వహించారు. ఆయన గొ ప్ప వక్త. రాజకీయవిశ్లేషణలోనే కాదు ఆర్థిక విశ్లేషణలో కూడా లోతయిన అవగాహన ఉన్నవారు. అప్పుల వూబి గురించి ఈ రోజు మాట్లాడు కుంటున్నాం గాని, ఈ విషయం గురించి ’తాకట్టులో భారత దేశం’ అని ఆయన ఎపుడో రాశారు. రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డికి నాగిరెడ్డి బావ. 

ఈ పేరును ఇపుడు మళ్లీ జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. నవంబర్ పదో తేదీన అనంతపురంలో జరిగే ప్రత్యేక హోదా సభా ప్రాంగణానికి (జూనియర్ కాలేజీ మైదానం) తరిమెల నాగిరెడ్డి పేరు పెట్టారు. ఆయన నిజాయితీ, అంకిత భావం త్యాగ నిరతి నుంచి పవన్ కల్యాణ్ స్ఫూర్తి పొందితే బాగుంటుంది. ఇలాగే సభా వేదికకు స్వాతంత్య్ర సమరయోధుడు కల్లూరు సుబ్బ రావు పేరు పెట్టారు. ఈయన కూడా అనంతపురం జిల్లాకు చెందిన వారే. 1897 లో జన్మించిన సుబ్బారావు నాటి రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ ఉద్యమాన్ని గ్రంధాలయోద్యమాన్ని నడిపి జాతీయ భావాలను ప్రచారం చేసిన నాయకుడు.

ఈ మధ్య ఈ నాయకుల పేర్లు ప్రస్తావనకు కూడ రావడంలేదు . అలాంటపుడు పవన్ ఈ రెండు పేర్లను, మరీ ముఖ్యంగా విప్లవ నాయకుడు తరిమెల నాగిరెడ్డి పేరును, ప్రస్తావించడమే కాకుండా, సభకు వారి పేర్లను వినియోగించుకోవడంలో ఏదో మతలబు ఉండి ఉండాలి.

 పవన్ తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకుని, రాజకీయాలలో హార్డ్ లైన్ తీసుకోవాలనుకుంటున్నట్లేనా ? తాను చెసేది అల్లాటప్ప ఉపన్యాసం కాదని తరిమెల నాగిరెడ్డి లాగా విప్లవాగ్ని రగిలిస్తాననే నమ్మకం రాయలసీమలో పవన్ కల్గించాలనుకుంటున్నాడా? సభలో తరిమెల నాగిరెడ్డి రాజకీయాల గురించి పవన్ ఏమనుకుంటున్నాడో చెబుతాడని అశిద్దాం. మావోయిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఏరివేస్తున్న తరుణంలో మావోవాది అయిన తరిమెల నాగిరెడ్ది గురించి పవన్ ఆలోచించడం తెలుగుదేశం నేతను కొంత ఇరుకున పెట్ట వచ్చు. లేక ఇదంతా పవనిజం మార్కెటింగ్ వ్యూహమా? ఎందుకంటే, పవన్ అన్నయ చిరంజీవి కూడా ఇలాగే పెద్ద పెద్ద పేర్లు తెచ్చారు.వాళ్ల ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు.

 2009 ఎన్నికల ముందు చిరంజీవి ఫ్లెక్సీలలో అంబేద్కర్, మదర్ ధెరీసా, ఫూలే, పెరియార్ ఫోటోలు కూడా దర్శనమిచ్చాయి. అయితే, చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరగానే, ఈ పోటోలన్నీ మాయమయి, సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ ఫోటోలు ప్రత్యక్ష మయ్యాయి. పవన్ కూడా అన్నయ్య లాగానే గొప్పవాళ్ల పేర్లు వాడుకుని ’కొయ్య గుర్రం’ జనసేనకు ప్రజామోదం తెచ్చుకోవాలనుకుంటున్నారా?

నవంబర్ 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రాంగణంలో ఈ ’ 'సీమాంధ్ర హక్కుల చైతన్య సభ'’ జరుగుతుంది. ఇందులో జనసేన కొయ్యగుర్రమో లేక నిజమయిన గుర్రమో ఆ రోజు తెలిసే అవకాశం ఉంది.

’రాష్ట్రానికి, దేశానికి అపార సేవలు అందించిన మహనీయులయిన తరిమెల నాగిరెడ్డి, కల్లూరి సుబ్బరావు లను స్మరించుకోవడం తన భాగ్యం,’అని మొక్కుబడిగా జై కొట్టి చేతులు దులుపుకుంటారా ? లేక మార్పు కోసం నిలబడతాడా?.