నిజంగానే స్వామి గవర్నర్ పైన కేసు వేస్తే ప్రధానమంత్రి పరువుతో పాటు గవర్నర్ వ్యవస్ధ పరువు కూడా మెరీనాబీచ్ పాలైనట్లే.

తమిళనాడులో గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు వ్యవహారం భారతీయ జనతా పార్టీ నేతలకే రుచిస్తున్నట్లు లేదు. మెజారిటీ ఎంఎల్ఏల మద్దతున్న శశికళను సిఎంగా చేయటం భాజపాకు ఇష్టంలేదు. దాంతో గవర్నర్ ను అడ్డుపెట్టుకుని రోజుకో నాటకం ఆడిస్తోంది కేంద్రం. తమిళనాడుకే చెందిన భాజపా ఎంపి సుబ్రమణ్య స్వామి గవర్నర్ పై కోర్టులో కేసు వేస్తానని హెచ్చరించటం గమనార్హం. పన్నీర్ సెల్వంను సిఎంగా చేద్దామని కేంద్రం అనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, ఇప్పటికీ పన్నీర్ కు అవసరమైనంత శాసనసభ్యుల మద్దతు రాలేదు. 234 మంది ఎంఎల్ఏలున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎంఎల్ఏల బలముండాలి.

అయితే, మొన్నటి లెక్కల ప్రకారం శశికళకే మెజారిటీ ఎంఎల్ఏల మద్దతు కనబడుతోంది. ఇప్పటికీ పన్నీర్ కు మద్దతిస్తున్న వారి సంఖ్య 15కు కూడా చేరుకోలేదట. ఈ లెక్కన పన్నీర్ సిఎంగా బాధ్యతలు స్వీకరించేందుకు చాలా కాలమే పట్టేట్లుంది. మరి అప్పటి వరకూ గవర్నర్ ఏం చేస్తారంటే, రోజుకో నాటకం ఆడుతూనే ఉంటారన్నదే సమాధానం. రాజ్యాంగబద్దంగా ఎటువంటి అడ్డంకులు లేకపోయినా ప్రతి రోజూ పారదర్శకత గురించి చెప్పే మోడి, భాజపాలు శశికళను సిఎం కానీయకుండా అడ్డుకోవటం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కటమే.

ఇటువంటి పరిస్ధితుల్లోనే గవర్నర్ వైఖరిపై భాజపాలోనే వ్యతరేకత మొదలైంది. తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి సోమవారం లోపు ముగింపు పలకాలంటూ సుబ్రమణ్యంస్వామి గవర్నర్ కు అల్టిమేట్ జారీ చేయటంతో కలకలం మొదలైంది. ప్రధానమంత్రి ఆడించినట్లే గవర్నర్ ఆడుతున్నాడన్నది స్పష్టం. అయితే, మెజారిటీ ఎంఎల్ఏల మద్దతున్న శశికళకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ స్వామి గవర్నర్ కు సూచించారు. స్వామి తీరు చూస్తుంటే భాజపాలోనే నరేంద్రమోడి, గవర్నర్ వ్యవహారశైలి నచ్చని వాళ్లు చాలామందే ఉన్నట్లు తెలుస్తోంది. నిజంగానే స్వామి గవర్నర్ పైన కేసు వేస్తే ప్రధానమంత్రి పరువుతో పాటు గవర్నర్ వ్యవస్ధ పరువు కూడా మెరీనాబీచ్ పాలైనట్లే.