భార్యమీద అనుమానంతో ఓ భర్త దారుణానికి తెగించాడు. మూడేళ్ల కొడుకుకు పురుగుల మందు తాగించి.. తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా దేవరకొండలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి,పెళ్లి చేసుకున్న భార్య మీద అనుమానంతో ఓ వ్యక్తి.. మూడేళ్ల కొడుకుకు పురుగుల మందు తాగించి, ఆ తరువాత తానూ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇదంతా పట్టపగలు నడి వీధిలో జరగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అతను కత్తి పట్టుకుని, తిప్పుతూ ఊగిపోతూ.. ఆపడానికి దగ్గరికి వచ్చే వారిని చంపేస్తానని బెదిరిస్తూ ఈ దారుణానికి ఒడిగట్టాడు.
పురుగుల మందు తాగి కింద పడిపోగానే.. స్థానికులు, పోలీసులు వెంటనే వారిద్దరినీ దేవరకొండ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించగా అప్పటికే వారు మృతి చెందారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే..మృతుడు బసవరాజు పాత నేరస్తుడిగా తేలింది. అతనికి 13 ఏళ్ల క్రితం అనిత అనే యువతికి ఫోన్లో పరిచయం కాగా.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
నేను బ్రహ్మంగారిని కాను : పవన్ కల్యాణ్ రాజకీయాలపై మంచు విష్ణు
అప్పటికే అతనికి నేర చరిత్ర ఉన్నప్పటికీ.. దాన్ని ఆమె దగ్గర దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన నెలకి అనిత గర్భం దాల్చింది. అప్పటికే అతను దొంగతనాలకు పాల్పడతాడన్న విషయం అనితకు తెలిసినా ఏమీ చేయలేక పోయింది. కొద్ది కాలానికి దొంగ సొమ్ము పంచుకునే దగ్గర వివాదం చెలరేగి స్నేహితుడిని హత్య చేసి జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత జైలు నుంచి తిరిగి వచ్చిన బసవరాజు భార్య మీద అనుమానాన్ని పెంచుకున్నాడు.
భార్యకు ఇంటి ఓనర్ తో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ గొడవలకు దిగుతుండేవాడు. మూడేళ్ల వయసున్న రెండోకొడుకు తనకు పుట్టలేదంటూ గొడవలకు దిగేవాడు. దీంతో అనిత పుట్టింటికి వెళ్ళింది. ఆమెను మాయ మాటలు చెప్పి తీసుకువచ్చిన బసవరాజు గురువారం ఈ దారుణానికి ఒడిగట్టాడు. భార్యతో మళ్లీ గొడవపడిన బసవరాజు ఆమెను చంపుతాను అంటూ కత్తితో వెంటపడ్డాడు.
భార్య, ఆమెతల్లి, పెద్ద కొడుకు బసవరాజుకు దొరకకుండా తప్పించుకున్నారు. చిన్న కొడుకు అతనికి చిక్కాడు. కొడుకును తీసుకుని వీధిలోకి వచ్చిన బసవరాజు.. ఆ చిన్నారికి పురుగుల మందు తాగించాడు. ఆ తర్వాత చిన్నారి అపస్మారకస్థితికి వెళ్లగానే.. వీధుల్లో కత్తితో వీరంగం వేస్తూ తాను కూడా పురుగుల మందు తాగాడు.అతనికి అనిత కంటే ముందే మరో యువతితో వివాహమైనట్లుగా తెలుస్తోంది.
బసవరాజు మట్కా ఆడతాడు. దొంగతనాలు చేస్తాడు. గతంలో గుంటూరులో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పలు చోరీ కేసులో నిందితుడు. కడప, గుంటూరులో 40 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దీనిమీద అతని భార్య అనిత మాట్లాడుతూ.. మోసంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, అంతకుముందే మరో భార్య ఉందన్న సంగతి చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
తమ పెళ్లైన తరువాత ఆమె ఫోన్ చేసి విపరీతంగా తిట్టిందని చెప్పుకొచ్చింది. గర్భవతి కావడంతో అతనితోనే ఉండిపోయానని చెప్పింది. అయినా అనుమానంతో తనను వేధించాడని తెలిపింది. దొరికితే తమని కూడా చంపేవాడని.. మూడేళ్ల బాబు బలైపోయాడని కన్నీటి పర్యంతమవుతోంది.
